సంక్షిప్త వార్తలు(8)
వైద్య, ఆరోగ్య శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 7 నుంచి 14 వరకు పరిశీలించనున్నట్లు నియామక సంస్థ గురువారం తెలిపింది.
7 నుంచి అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగార్థుల ధ్రువపత్రాల పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 7 నుంచి 14 వరకు పరిశీలించనున్నట్లు నియామక సంస్థ గురువారం తెలిపింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, https://mhsrb.telangana.gov.in లో వివరాలను పరిశీలించాలని తెలిపింది.
పదోన్నతులకు ఎస్సైల వినతి
ఈనాడు, హైదరాబాద్: సీఐలుగా పదోన్నతుల కల్పనలో తమకు న్యాయం చేయాలని 2009 బ్యాచ్‌కు చెందిన పలువురు ఎస్సైలు కోరారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతలను గురువారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తమ బ్యాచ్‌లో మొత్తం 450 మంది ఎస్సైలుండగా.. 200 మంది సీఐలుగా పదోన్నతులు పొందారని తెలిపారు. వరంగల్ జోన్‌లోని 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు సైతం సీఐలుగా పదోన్నతి పొందారన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల స్థాయి పెంచడంతో మల్టీజోన్-2లో 150 సీఐ పోస్టులు ఏర్పడ్డాయని, మరో 25 ఖాళీలు ఇప్పటికే ఉన్నాయని వివరించారు. 2009 బ్యాచ్‌లో మిగిలిన 230 మంది ఎస్సైలకు సీనియారిటీ ప్రకారం పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు.
డీజీపీ అంజనీకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎరిన్ ఫిషర్
హైదరాబాద్ నగరంలోని అమెరికన్ కాన్సులేట్‌లో ఓవర్సీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న ఎరిన్ ఫిషర్ గురువారం డీజీపీ అంజనీకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసు పనితీరును ఆమెకు డీజీపీ వివరించారు. పోలీసులపై రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు.
ఈనాడు, హైదరాబాద్
5న తెలంగాణ బాల సాహిత్య సమ్మేళనం
నారాయణగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఈ నెల 5వ తేదీన తెలంగాణ బాల సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య తెలిపారు. గురువారం పరిషత్తులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరవాత తొలిసారిగా బాల సాహిత్య సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో తెలంగాణలో ఇప్పటి వరకు వచ్చిన బాల సాహిత్యంపై సమీక్ష, బాల సాహిత్య రచన శైలి ఎలా ఉండాలి అన్న అంశంపై నిపుణుల ప్రసంగాలు ఉంటాయని, ప్రతిభావంతులైన బాలలు తమ రచన అనుభవాలు పంచుకుంటారని వివరించారు. విద్యార్థులు కథ, కవిత, వ్యాసం తదితర రచనలు వెలువరించేందుకు తోడ్పాటునందిస్తున్న ఉపాధ్యాయులు తమ అనుభవాలను తెలియజేస్తారని అన్నారు. పరిషత్తు అధ్యక్షుడు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమ్మేళనానికి శాంతా బయోటెక్నిక్స్ అధినేత డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి హాజరవుతారని చెప్పారు.
లక్ష్మీ పంపుహౌస్ నుంచి అయిదు టీఎంసీల ఎత్తిపోత
కాళేశ్వరం, న్యూస్‌టుడే: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీ పంపుహౌస్ మోటార్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మునిగిన మోటార్ల పునరుద్ధరణ అనంతరం గత నెల 4వతేదీ నుంచి వరుస క్రమంలో కొన్ని మోటార్లను నిత్యం రాత్రి వేళల్లో నడుపుతూ గోదావరి జలాలు ఎత్తిపోస్తుండగా, గ్రావిటీ కాల్వ ద్వారా సరస్వతీ బ్యారేజీకి చేరుకుంటున్నాయి. మొత్తంగా ఇప్పటివరకూ అయిదు టీఎంసీలు సరస్వతీ బ్యారేజీకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
రానున్న మూడు రోజులు చలి వాతావరణం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు చలి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో 18 డిగ్రీల లోపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీహెచ్‌ఈఎల్, రామచంద్రాపురం, పటాన్‌చెరు ప్రాంతాల్లో 13.7 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు బుధవారం తెల్లవారు జామున రాష్ట్రంలోనే కనిష్ఠంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 9.6, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.8, సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు. గురువారం పగటిపూట రాష్ట్రంలోనే గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యానంబైలులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్: సింగరేణి ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజూ 2.3 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా సాధించేలా ఏరియా జనరల్ మేనేజర్లు దృష్టిసారించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఒడిశాలోని నైనీ, కొత్తగూడెంలోని వీకే ఓపెన్‌కాస్ట్ నుంచి 80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. గురువారమిక్కడ సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లు, సలహాదారులు, ఏరియాల జీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి మూడు నెలల్లో రికార్డు స్థాయిలో రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇదే స్థాయిలో వర్షాకాలం వరకు ఉత్పత్తి, రవాణా కొనసాగిస్తే వచ్చే ఏడాదికి నిర్ణయించిన 750 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం కష్టమేమీ కాదు. రామగుండం-1, 2, 3 ఏరియాలో అన్ని గనులు గతం కన్నా మెరుగ్గా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. శ్రీరాంపూర్, మందమర్రి గనులు లక్ష్యాలకు చేరువగా ఉన్నాయి. భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాలు మరింత మెరుగ్గా పనిచేయాలి. రానున్న రోజుల్లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల టెండర్లు సహా ఇతర ప్రక్రియలు మూడు నెలల ముందుగానే పూర్తిచేయాలి’ అని సీఎండీ మార్గదర్శనం చేశారు.
గిరిజన ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ విడుదల చేయాలి: టీపీటీఎఫ్
ఈనాడు, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని ఆ శాఖ అదనపు డైరెక్టర్ వి.సర్వేశ్వర్‌రెడ్డికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.అశోక్‌కుమార్, ముత్యాల రవీందర్ గురువారం విజ్ఞప్తి చేశారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని అదనపు డైరెక్టర్ తెలిపినట్లు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kangana Ranaut: ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి: కంగనా రనౌత్
-
Politics News
New Front: నవీన్ పట్నాయక్‌తో మమత భేటీ.. కూటమిపై చర్చించారా..?
-
Sports News
Wasim Jaffer: సూర్యకుమార్‌కు బదులు సంజూ శాంసన్‌ని తీసుకోండి: వసీం జాఫర్
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
Movies News
Rashmika: మనుషులందరినీ ఒకేలా చూస్తా.. అందుకే వాళ్ల కాళ్లకు దండం పెడతా: రష్మిక