సభా సమరం

అధికార, విపక్షాల వ్యూహప్రతివ్యూహాల నడుమ రాష్ట్ర శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి.

Updated : 03 Feb 2023 05:46 IST

నేటి నుంచి శాసనసభ సమావేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: అధికార, విపక్షాల వ్యూహప్రతివ్యూహాల నడుమ రాష్ట్ర శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్‌ తమిళిసై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాదాపు రెండేళ్ల తర్వాత గవర్నర్‌ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. భారత్‌ రాష్ట్ర సమితిగా తెరాస మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతోనూ పార్టీ వ్యూహంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. విపక్షాలు సైతం సమావేశాలను కీలకంగా భావిస్తూ సన్నద్ధమవుతున్నాయి. దీంతో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి.

తొలి రోజు నుంచే...

మొదట్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా సమావేశాలను జరపాలని ప్రభుత్వం భావించింది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఆమె బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌, రాజ్‌భవన్‌ న్యాయవాది మధ్య జరిగిన చర్చల్లో రాజ్‌భవన్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య రాజీ కుదిరింది. గవర్నర్‌ ప్రసంగానికి ప్రభుత్వం అంగీకరించగా.. ఆమె సైతం బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం సిద్ధం చేసి గురువారం పంపించింది.

రెండు వారాల పాటు సమావేశాలు

శాసనసభ, మండలి సమావేశాలను రెండు వారాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది, శుక్రవారం బడ్జెట్‌పై గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. అనంతరం శాసనసభ, మండలి కార్యకలాపాల సలహా కమిటీల(బీఏసీ) సమావేశాలు నిర్వహిస్తారు. శనివారం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దీనిపై చర్చ సాగుతుంది. ఆదివారం సెలవు దినం కాగా... ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రసంగాలు చేస్తారు. మంగళవారం సభలకు సెలవు. ఆ తర్వాత నుంచి సమావేశాలను కొనసాగిస్తారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహించనుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు, నలుగురు మాజీ సీఎంలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంతో పాటు ఇతర అంశాల దృష్ట్యా ఈ నెల 16తోనే సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బీఏసీలో సభ్యుల అభిప్రాయాల అనంతరం ప్రభుత్వం ఈమేరకు ప్రతిపాదించనుంది. అనంతరం శాసనసభాపతి, మండలి ఛైర్మన్లు సమావేశాల తేదీలను ప్రకటిస్తారు.

బడ్జెట్‌పై అందరి దృష్టి

రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాదే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికలు, ప్రాధాన్య ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల దృష్ట్యా బడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలను బడ్జెట్‌ ప్రతిబింబించనుంది. సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చాటాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేల ఎర ఉదంతంతో పాటు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, తాజాగా బడ్జెట్‌లో కేటాయింపులేమీ లేకపోవడం తదితర అంశాలను ప్రస్తావించనుంది. మరోవైపు కాంగ్రెస్‌, భాజపా పక్షాలు సైతం ప్రభుత్వ విధానాలపై తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకొని పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సమావేశాలు జరిగే రోజుల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపింది. శాసనసభ చుట్టూ, గన్‌పార్క్‌ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. గత రెండేళ్లు కరోనా నిబంధనల మేరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్వహించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు