తెలంగాణలో మెరుగైన పారిశ్రామిక విధానం

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందనీ, టీఎస్‌ఐపాస్‌ వంటి మెరుగైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.

Published : 03 Feb 2023 05:25 IST

ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రానికి 47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు
ఐటీ ఎగుమతులు, వ్యవసాయంలో రాష్ట్రం ముందంజ
తెలంగాణ తరహాలో పనిచేస్తేనే దేశాభివృద్ధి
ఎన్‌హెచ్‌ఆర్‌డీ జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌- మాదాపూర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందనీ, టీఎస్‌ఐపాస్‌ వంటి మెరుగైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గడిచిన ఎనిమిదిన్నరేళ్ల కాలంలో 47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఫలితంగా ప్రత్యక్షంగా 21 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, మెటా, నోవార్టిస్‌, మైక్రోసాఫ్ట్‌, ఉబర్‌ వంటి బహుళజాతి సంస్థలకు చెందిన రెండో అతిపెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. నేషనల్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌(ఎన్‌హెచ్‌ఆర్‌డీ) 25వ జాతీయ సదస్సు గురువారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగింది. ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచానికి అవసరమైన టీకాల్లో మూడో వంతు ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తూ.. ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ పేరు గడించిందన్నారు. ఓ వైపు పరిశ్రమలు, మరో వైపు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. గడిచిన ఎనిమిదేళ్లల్లో 7.7 శాతం పచ్చదనం పెంపొందించి, దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నామనీ, ఐటీ ఎగుమతుల్లో, వ్యవసాయ రంగంలో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు.

దేశానికి కేసీఆర్‌ వంటి నేత నాయకత్వం వహిస్తే...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టడం కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని కేటీఆర్‌ చెప్పారు. ‘‘తెలంగాణ తరహాలో మిగతా రాష్ట్రాలు పనిచేసినప్పుడు, కేసీఆర్‌ లాంటి నాయకుడు దేశానికి నాయకత్వం వహించినప్పుడు.. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్లు కాదు.. 15 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకుంటుంది. భారత్‌ జనాభాలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీలో 5 శాతం భాగస్వామ్యం వహిస్తోంది. 2014 నాటికి తెలంగాణలో తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుంటే.. గత ఏడాది జూన్‌ నాటికి రూ.2.78 లక్షలకు చేరింది. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5 లక్షల కోట్లుంటే.. గత ఏడాది జూన్‌ నాటికి రూ.11.55 కోట్లకు చేరింది.

సంపద ప్రజలకు సమానంగా పంపిణీ కావాలి

జీడీపీ అనేది ఆర్థిక కార్యకలాపాలకు ప్రతిబింబం మాత్రమే. దేశంలోని సహజ వనరులు, మానవ వనరులే నిజమైన దేశ సంపద. దేశ నాయకత్వం సంపదని ప్రజలకు సమానంగా పంపిణీ చేయడంపై దృష్టి సారించినప్పుడు దేశమంతా పురోగమిస్తుంది. జీడీపీలో భారత్‌.. ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండవచ్చు. కానీ తలసరి ఆదాయం విషయానికి వస్తే 142వ స్థానంలో ఉంది. 1987లో చైనా, భారత్‌ల జీడీపీ సమానంగా ఉండేది. కానీ 35 ఏళ్ల తరువాత చైనా ఆర్థిక వ్యవస్థ 18 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటే.. భారత్‌ 3.4 ట్రిలియన్ల వద్దే ఉంది. తలసరి ఆదాయం విషయానికి వస్తే.. చైనాలో 13 వేల డాలర్లుంటే.. భారత్‌లో 2,400 డాలర్లు మాత్రమే ఉంది. 11 శాతం సాగు భూమి ఉన్న జపాన్‌.. ప్రసుత్తం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. చైనా, జపాన్‌ లాంటి దేశాలు తమ ప్రజల ఆకాంక్షలని, అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేశాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో తెలివైన నాయకులు ఉన్నప్పటికీ.. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఇవ్వడం లేదు. స్వతంత్ర భారత్‌ నుంచి ప్రపంచ స్థాయి బ్రాండ్‌ ఉత్పత్తిని సృష్టించలేకపోయాం. యాపిల్‌, శాంసంగ్‌, టయోటా, సోని, హోండా, బీఎండబ్ల్యూ.. ఇలా ఎన్నో బ్రాండ్లను చిన్న చిన్న దేశాలు సృష్టించాయి. హైదరాబాద్‌ కంటే తక్కువ జనాభా ఉన్న సింగపూర్‌, తైవాన్‌ లాంటి దేశాలు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. మన దేశ యువత ఉద్యోగం సంపాదించడమే లక్ష్యం కాకుండా.. ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదిగి ప్రపంచస్థాయి సంస్థలను, ఉత్పత్తులను సృష్టించాలి’’ అని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్‌ అధ్యక్షులు డా.విపుల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు