అనాథల సంక్షేమానికి సమగ్ర చట్టం తేవాలి

అనాథల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ శాసనసభలో సమగ్ర చట్టం రూపొందించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు.

Published : 03 Feb 2023 04:05 IST

మంద కృష్ణమాదిగ

బౌద్ధనగర్‌, న్యూస్‌టుడే: అనాథల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ శాసనసభలో సమగ్ర చట్టం రూపొందించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. సికింద్రాబాద్‌లోని ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యాలయంలో గురువారం అనాథల హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనాథల సంక్షేమానికి చర్యలు చేపట్టాలంటూ సీఎంకు రాసిన బహిరంగ లేఖను మంద కృష్ణమాదిగ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాథల సంక్షేమంపై 2022లో నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల్లోని ఒక్క అంశాన్నీ ప్రభుత్వం అమలు చేయలేదని, వారి బాగోగుల కోసం ఇచ్చిన హామీలను సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. ఆ సిఫార్సులు, హామీలను అమలు చేసేలా ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని, లేనిపక్షంలో ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ‘అనాథల అరిగోస’ దీక్షలు ప్రారంభిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘అనాథలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత చదువులు అందించేందుకు ఇంటీగ్రేటెడ్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలి. వారితో భిక్షాటన చేయిస్తున్న వ్యక్తులపై పీడీ యాక్టు పెట్టాలి. అనాథల జీవితాల్లో వెలుగులు నింపాలంటూ మంత్రులు, అధికారులను కలవనున్నాం’’ అని మంద కృష్ణమాదిగ తెలిపారు. ఈ సమావేశంలో వేదిక రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు వెంకటేశ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు