రాష్ట్రంలో గుణాత్మక అభివృద్ధి

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం, వివిధ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.

Published : 03 Feb 2023 04:05 IST

జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందంతో సీఎస్‌ శాంతికుమారి

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం, వివిధ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. వేసవిలోనూ పరిశ్రమలకు, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, తద్వారా వ్యవసాయంలో అద్వితీయ పురోగతి సాధించామన్నారు. రాష్ట్రంలో 2014లో రూ.5.05 లక్షల కోట్లున్న జీఎస్‌డీపీ 2022-23 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు చేరుకుందని, రూ.1.24 లక్షలున్న తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా గురువారం బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ‘‘అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలను, పట్టణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటుచేశాం. మిషన్‌ భగీరథ పథకం తాగునీటి సమస్యను తగ్గించడతోపాటు అనేక ఆరోగ్య సంబంధ సమస్యలను పరిష్కరించడంలో దోహదపడింది. ఆరోగ్య రంగంలో వివిధ అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 270 కోట్ల మొక్కలు నాటడం ద్వారా 7.7 శాతం పచ్చదనం పెంచడానికి సహాయపడింది’’ అని సీఎస్‌ విశదీకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని