వైభవంగా సమతా కుంభ్‌ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

Updated : 03 Feb 2023 05:40 IST

భగవంతుడితో అనుబంధం ప్రతి ఒక్కరికీ అవసరం: చిన జీయర్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలోని వాహనాలు నిలిపే స్థలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి, దేవనాధ జీయర్‌ స్వామి, అహోబిల జీయర్‌ స్వామిలు మొదటి వార్షికోత్సవాలకు గురువారం రాత్రి ఆగమశాస్త్రబద్ధంగా అంకురార్పణ చేశారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి చిన జీయర్‌ స్వామి ప్రవచించారు. వెయ్యేళ్ల క్రితమే అట్టడుగు వర్గాల వారికి మార్గదర్శనం చేసిన భగవద్రామానుజాచార్యుల ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుడితో అనుబంధం పెంచుకుంటేనేే జీవితం సాఫీగా సాగుతుందన్నారు. ఆధ్యాత్మిక గ్రంథాల సారాంశాన్ని భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.

సేవలందిస్తున్న వికాస తరంగిణి కార్యకర్తలు

సమతాకుంభ్‌ ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవా ప్రతినిధులు పకడ్బందీగా ఏర్పాట్లను చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 3 వేల మంది వికాస తరంగిణి కార్యకర్తలు శ్రీరామనగరానికి చేరుకుని సేవలందిస్తున్నారు. 5 వందల మంది ఎన్‌సీసీ విద్యార్థులు, వంద మంది సైబరాబాద్‌ పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని