రాజబహుద్దూర్‌ వెంకటరామారెడ్డి పేరుతో వర్సిటీని నిర్మించాలి: హరీశ్‌రావు

రాజబహుద్దూర్‌ వెంకటరామారెడ్డి పేరుతో నిర్మించే వసతిగృహ సముదాయం ఆవరణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వవిద్యాలయం నిర్మాణానికి ట్రస్టు సభ్యులు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు.

Published : 03 Feb 2023 04:05 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: రాజబహుద్దూర్‌ వెంకటరామారెడ్డి పేరుతో నిర్మించే వసతిగృహ సముదాయం ఆవరణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వవిద్యాలయం నిర్మాణానికి ట్రస్టు సభ్యులు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు  అందిస్తామని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో రెడ్డి వసతిగృహ సముదాయాలకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలో నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ జరిగింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, ఎమ్మెల్సీ వాణిదేవి, రాష్ట్ర మహిళ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... వెంకటరామారెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం విద్యాక్షేత్రంగా విరాజిల్లాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరిక అని తెలిపారు. గతంలో వెంకటరామారెడ్డి స్థాపించిన వసతిగృహాలలో చదువుకుని ఎంతోమంది ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించారని గుర్తుచేశారు. భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించగా, ట్రస్టు సభ్యుల కోరిక మేరకు అందులో రూ.5 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 15 ఎకరాలకు అదనంగా మరో ఎకరా స్థలం కేటాయించాలని ట్రస్టు సభ్యులు కోరగా, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. రెడ్డి మహిళా కళాశాల లేకుంటే తాను చదువుకునేదాన్ని కాదేమోనని మంత్రి సబిత అన్నారు. వసతిగృహ సముదాయాల నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు