3 విమానాశ్రయాల ఏర్పాటే సాంకేతికంగా సాధ్యం

తెలంగాణ ప్రభుత్వం 6 ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా.. వరంగల్‌ (మామునూరు), ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ (జక్రాన్‌పల్లి)లలో మాత్రమే వాటి ఏర్పాటు సాంకేతికంగా సాధ్యమవుతుందని అధ్యయనంలో తేలినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకేసింగ్‌ (రిటైర్డ్‌) తెలిపారు.

Published : 03 Feb 2023 04:28 IST

తెలంగాణ ప్రతిపాదనలపై కేంద్రం సమాధానం

ఈనాడు, దిల్లీ: తెలంగాణ ప్రభుత్వం 6 ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా.. వరంగల్‌ (మామునూరు), ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ (జక్రాన్‌పల్లి)లలో మాత్రమే వాటి ఏర్పాటు సాంకేతికంగా సాధ్యమవుతుందని అధ్యయనంలో తేలినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకేసింగ్‌ (రిటైర్డ్‌) తెలిపారు. లోక్‌సభలో మహబూబాబాద్‌, పెద్దపల్లి, చేవెళ్ల ఎంపీలు మాలోత్‌ కవిత, వెంకటేష్‌ నేత, జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు గురువారం మంత్రి ఈ సమాధానమిచ్చారు. అదనపు భూసేకరణ లేకుండా ప్రైవేటు రంగంలో చిన్న విమానాల రాకపోకలకు అనుగుణంగా ఆ మూడింటిని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు పేర్కొన్నారు. 

ఏటీఎఫ్‌పై పన్నులు తగ్గించని తెలుగు రాష్ట్రాలు

విమానయాన రంగం నష్టాలు తగ్గించేందుకు 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు.. విమాన ఇంధనంపై (ఏటీఎఫ్‌) విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) తగ్గించుకున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లేవని పేర్కొన్నారు. దేశీయంగా నిర్వహణ, మరమ్మతుల విషయంలో జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. నష్టాల నుంచి విమానయాన రంగం కోలుకోవడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు. విమానాలు ప్రైవేటు రంగంలో నడుస్తున్నాయని.. 2019-20లో రూ.4,770 కోట్లు, 2020-21లో రూ.12,479 కోట్లు, 2021-22లో రూ.11,658 కోట్లను విమానయాన రంగం నష్టపోయిందని మంత్రి వెల్లడించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌పై...

హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర వాటా 50 శాతాన్ని తెలంగాణ ప్రభుత్వం జమ చేయడంపై ఆధారపడి.. పనుల పూర్తి ఉంటుందని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.

* జాతీయ రహదారుల అభివృద్ధికి 2017-18 నుంచి 2022 డిసెంబరు 31 వరకూ తెలంగాణకు రూ.5,890 కోట్లు కేటాయించగా రూ.5,534 కోట్లు వ్యయం చేసినట్లు నితిన్‌గడ్కరీ తెలిపారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు