జులై 1న గ్రూప్‌-4 రాత పరీక్ష

రాష్ట్రంలో గ్రూప్‌-4 సర్వీసులకు సంబంధించి పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటించింది.

Published : 03 Feb 2023 04:28 IST

నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
9 లక్షలు దాటిన దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-4 సర్వీసులకు సంబంధించి పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 పోస్టుల నియామకానికి జులై 1న (శనివారం) దీనిని నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో  నిర్వహించనుంది. ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. రెండు పేపర్లలో కలిపి 300 మార్కులు ఉంటాయి. ప్రతిపేపర్‌కు కాలవ్యవధి రెండున్నర గంటలు. మరోవైపు గ్రూప్‌-4 పరీక్షకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. శుక్రవారం తుది గడువు. 2018లో నిర్వహించిన ఈ పరీక్షకు 4.8 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ఈ సారి నిర్వహించే పరీక్ష కోసం గురువారం రాత్రి దాకా 9.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2018లో జరిగిన వీఆర్‌వో పోస్టుల భర్తీ రాతపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మొత్తం 10.58లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించిన దరఖాస్తుల్లో ఈ సంఖ్యే అత్యధికం.

వారం రోజులుగా కసరత్తు...

గ్రూప్‌-4 రాత పరీక్ష తేదీపై టీఎస్‌పీఎస్సీ భారీ స్థాయిలో కసరత్తు చేసింది. తొలుత మేనెలలో నిర్వహించాలని భావించింది. ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని, నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. దరఖాస్తులు భారీగా వస్తున్న పరిస్థితుల్లో కనీసం 3వేలకు పైగా పరీక్ష కేంద్రాలు అవసరం. ఇందుకు తగ్గట్టుగా పాఠశాలలు కావాలి. అయితే ఏప్రిల్‌ 23 నుంచి జూన్‌ 3 వరకు పాఠశాలలకు సెలవులు. ఆ సమయంలో పరీక్ష తేదీ ప్రకటిస్తే ఇన్విజిలేటర్ల కొరత వంటివి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని భావించింది. జూన్‌ తొలివారంలో నిర్వహించాలని అనుకున్నా గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు ఉంటాయి. జూన్‌ 13 నుంచి 22 వరకు యూజీసీ నెట్‌ పరీక్షలు, జూన్‌ 25న ఐఈఎస్‌ పరీక్ష ఉంది. జులై 2న ఆదివారం జరపాలని భావించినప్పటికీ, అదేరోజున పోటీపరీక్షల కోసం ముందుగానే పరీక్ష కేంద్రాలను యూపీఎస్సీ రిజర్వు చేసింది. జులై రెండో వారంలో నిర్వహిస్తే వర్షాలతో అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో జులై 1న(శనివారం) పరీక్ష పెట్టాలని కమిషన్‌ నిర్ణయించింది. శనివారం చాలా మంది ప్రైవేటు ఉద్యోగులకు సెలవు ఉండడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. తాజా నిర్ణయంతో  సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు దాదాపు ఐదు నెలలు సమయం దక్కనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు