మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో నిండిపోతున్న టీచర్‌ పోస్టులు

ఓవైపు స్పౌజ్‌ బదిలీలు.. మరోవైపు ‘పలుకుబడి బదిలీలు’.. ఫలితంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అరకొరగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు నిండిపోతున్నాయి.

Updated : 03 Feb 2023 05:32 IST

స్పౌజ్‌, ‘పలుకుబడి’ బదిలీలతో ఖాళీల భర్తీ
భవిష్యత్తులో పదోన్నతులు దక్కేనా?
స్థానిక ఉపాధ్యాయుల్లో ఆందోళన
మరికొన్ని చోట్లా ఇదే పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: ఓవైపు స్పౌజ్‌ బదిలీలు.. మరోవైపు ‘పలుకుబడి బదిలీలు’.. ఫలితంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అరకొరగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు నిండిపోతున్నాయి. ముఖ్యంగా మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు బదిలీల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో ఉన్న కొద్దిపాటి ఖాళీలూ బదిలీ అయి వస్తున్న ఉపాధ్యాయులతో భర్తీ అవుతుండటంతో భవిష్యత్తులో తమకు పదోన్నతులు దక్కవని స్థానిక సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) ఆందోళన చెందుతున్నారు. హనుమకొండ లాంటి నగర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భార్యాభర్తల(స్పౌజ్‌) కేటగిరీ కింద 427 మంది స్కూల్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం 12 జిల్లాలకు బదిలీ చేసింది. వీరిలో మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకు వచ్చినవారు వంద మంది వరకు ఉన్నారు. వీటికి అదనంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నేరుగా ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న ఆదేశాలతో(వీటిని సచివాలయ బదిలీలుగా పిలుస్తున్నారు) మరో 120 మంది బదిలీపై వచ్చారు. వీరిలో 70 మందికిపైగా మేడ్చల్‌, రంగారెడ్డితోపాటు హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలకే వచ్చారు. ఫలితంగా తమకు పదోన్నతి మార్గాలు మూసుకుపోతున్నాయని స్థానిక ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. మేడ్చల్‌ జిల్లాలో పదోన్నతి ద్వారా భర్తీ చేసేందుకు ఒక్క ఆంగ్లం, భౌతికశాస్త్రం, గణితం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు కూడా లేకుండాపోయింది. రంగారెడ్డి జిల్లాలో గణితం సబ్జెక్టులోనూ పదోన్నతుల పరిస్థితీ ఇలాగే ఉందని చెబుతున్నారు.

ఏడాది నుంచి రెండు జిల్లాలకు బదిలీల పరంపర

గత ఏడాది జనవరిలో 317 జీవో ద్వారా వికారాబాద్‌ నుంచి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు పలువురు ఉపాధ్యాయులు వచ్చారు. ఆ తర్వాతి నెలలో ‘పలుకుబడి బదిలీల’ ద్వారా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు పదుల సంఖ్యలో ఇతర జిల్లాల నుంచి టీచర్లు వచ్చారు. స్పౌజ్‌ కేటగిరీ కింద ఆ రెండు జిల్లాల్లో బదిలీల కోసం ఖాళీలకు మించి దరఖాస్తులు అందాయి. వారందర్నీ అనుమతిస్తే వచ్చే కొన్నేళ్లపాటు పదోన్నతులు, కొత్తగా నియామకాలు ఉండవని ప్రభుత్వం దృష్టికి విద్యాశాఖ తీసుకెళ్లింది. దాంతో అప్పట్లో మేడ్చల్‌, రంగారెడ్డి, వరంగల్‌ తదితర 13 జిల్లాలకు స్పౌజ్‌ కేటగిరీ బదిలీలను నిలిపివేశారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు కొందరు స్పౌజ్‌ ఉపాధ్యాయులు రెండు జిల్లాలకు వచ్చారు. ఇంకా వందల సంఖ్యలో దరఖాస్తులు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యక్ష నియామకాలు చేపట్టేందుకు వీలుగా 30 శాతం పోస్టులను ఖాళీగా ఉంచి.. మిగతా వాటిలో స్పౌజ్‌ బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ఇటీవలే అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ‘సచివాలయ బదిలీలు’ పెద్దఎత్తున జరగడంతో ప్రత్యక్ష నియామకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. ‘సచివాలయ బదిలీల కారణంగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ఉపాధ్యాయులు, నిరుద్యోగులు నష్టపోతున్నారు. వాటిని వెంటనే ఆపాలి’ అని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య కోరారు.

ఖాళీ లేకున్నా పోస్టింగులు

ఇతర జిల్లాల్లో 11 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉండగా.. నగర ప్రాంత జిల్లాల్లో 24 శాతం వస్తుందన్న ఉద్దేశంతో రూ.లక్షలు ఖర్చు చేసేందుకూ కొందరు ఉపాధ్యాయులు వెనకాడటం లేదు. నిత్యం ఎవరో ఒకరు వచ్చి బదిలీ ఉత్తర్వులు ఇస్తుండటంతో వారు కోరుకున్న పాఠశాలలో ఆ సబ్జెక్టు పోస్టు ఖాళీ లేకున్నా పోస్టింగ్‌ ఇస్తున్నారు. ఉదాహరణకు మేడ్చల్‌ జిల్లా కాప్రా ప్రాంతంలో ఉన్న ఓ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా లేకున్నా కేటాయించారు. ఆ టీచర్‌తో ఆంగ్లం పాఠాలు చెప్పిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఆంగ్లం ఉపాధ్యాయులు సాంఘిక శాస్త్ర పాఠాలు బోధిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు