పోతిరెడ్డిపాడు విస్తరణ చేపట్టడం లేదన్న ఏపీ

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణ పనులు చేపట్టడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు.

Published : 03 Feb 2023 04:59 IST

లోక్‌సభలో కేంద్రమంత్రి వెల్లడి

ఈనాడు, దిల్లీ: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణ పనులు చేపట్టడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల కంటే తక్కువగానే తాము తీసుకుంటున్నట్లు ఏపీ తెలిపిందని వెల్లడించారు.

* అందుబాటు ధరలో విమాన ప్రయాణాలు అందించేందుకు ఉడాన్‌లో ప్రాంతీయ అనుసంధానత పథకాన్ని (ఆర్సీఎస్‌) 2016లో ప్రవేశపెట్టామని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకేసింగ్‌ (రిటైర్డ్‌) గురువారం లోక్‌సభలో తెలిపారు. ఈ పథకంలో 500-600 కిలోమీటర్ల మధ్య దూరానికి ఎంపిక చేసిన మార్గాల్లో నిర్దేశించిన సంఖ్యలో సీట్లకు రూ.2,500 టికెట్‌ ధర లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ మార్గాల్లో విమానయాన సంస్థలు 50 శాతం సీట్లను లేదా గరిష్ఠంగా 40 సీట్లకు అందుబాటు ధరలు వర్తింపజేయాల్సి ఉంటుందని తెలిపారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

* రాజీవ్‌గాంధీ జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం 2018లో పంపిన ప్రతిపాదనలను.. సదరు వర్సిటీ ఆమోదించలేదని మంత్రి తెలిపారు. ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.

* హస్తకళల అభివృద్ధికి 2017-18 నుంచి 2021-22 వరకు తెలంగాణకు రూ.11.33 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.

*  గ్రేటర్‌ వరంగల్‌, కరీంనగర్‌లకు స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద రూ.196 కోట్ల చొప్పున రూ.392 కోట్లు విడుదల చేయగా ఆ మొత్తం ఖర్చయిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని