మరోసారి పోడు దరఖాస్తుల పరిశీలన!

పోడు భూముల హక్కు పత్రాల జారీ కోసం జరుగుతున్న పరిశీలన ప్రక్రియ పలు జిల్లాల్లో ఇప్పటికే పూర్తికాగా, మరికొన్నింటిలో కొనసాగుతోంది.

Published : 03 Feb 2023 04:59 IST

అర్హమైన మరిన్ని గుర్తించేందుకే
కీలకం కానున్న జిల్లా స్థాయి కమిటీ పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: పోడు భూముల హక్కు పత్రాల జారీ కోసం జరుగుతున్న పరిశీలన ప్రక్రియ పలు జిల్లాల్లో ఇప్పటికే పూర్తికాగా, మరికొన్నింటిలో కొనసాగుతోంది. పరిశీలన పూర్తయినచోట అర్హుల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించాలని, అర్హమైనవాటిని ఆమోదించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖల అధికారులకు తాజాగా సూచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు కొన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి కమిటీల వద్ద ఇంకా దరఖాస్తులు పరిశీలన దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లకు గిరిజన శాఖ ఇటీవల లేఖ రాసింది.

శాటిలైట్‌ చిత్రాల ద్వారానే

పోడు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో శాస్త్రీయ ఆధారాల ద్వారానే అర్హులను గుర్తించాలని, ప్రాథమిక ఆధారాలుగా శాటిలైట్‌ చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని గిరిజనశాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్ర గిరిజన శాఖ సంయుక్త కార్యదర్శి ఇచ్చిన మార్గదర్శకాలను కలెక్టర్లకు పంపిన లేఖలో పునరుద్ఘాటించింది. దరఖాస్తుదారు పోడు సాగులో ఉన్నారా? లేరా? అన్న అంశంపై శాస్త్రీయ ఆధారం తప్ప ఇతరాలు వద్దని స్పష్టం చేసింది.

ఎక్కువ ఆమోదం కొత్తగూడెం, మహబూబాబాద్‌లో?

రాష్ట్రంలో పోడు పట్టాల కోసం 4,14,353 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా 12,46,846 ఎకరాల అటవీ భూములకు పట్టాలు అడుగుతున్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం 2005 డిసెంబరు 13 కంటే ముందు సాగులో ఉన్న గిరిజనులకు మాత్రమే సదరు భూమిపై హక్కు పత్రాలు ఇవ్వాలని చట్టం చెబుతోంది.

ఆ ప్రకారం వికారాబాద్‌ జిల్లా నుంచి మొత్తం 19,973 దరఖాస్తులు వచ్చాయి. 20,797 ఎకరాలకు పట్టాలు అడిగారు. ఇందులో 533 దరఖాస్తుల్ని సబ్‌ డివిజన్‌ కమిటీ ఆమోదించింది. వీటిని పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీ 106 దరఖాస్తుల్ని (133.35 ఎకరాలు) తిరస్కరించింది. పోడు పట్టాలు ఇచ్చే భూములు 475.36 ఎకరాలుగా తేల్చింది. అత్యధికంగా కులకచర్ల మండలం నుంచి 1,271 దరఖాస్తులు రాగా,187 ఆమోదించి 223 ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

* ములుగు జిల్లాలో మొత్తం 34,080 దరఖాస్తులు రాగా..2,719 ఆమోదించినట్లు తెలిసింది. మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి. మరో 449 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

* భూపాలపల్లి జిల్లాలో 25,394 దరఖాస్తుల్లో 683 అర్హమైనవిగా తేల్చినట్టు సమాచారం. పలు జిల్లాల్లో ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే ప్రధానంగా భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో, ఆ తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌లో ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ తాజా సూచనల నేపథ్యంలో జిల్లా స్థాయిలో తిరస్కరించిన దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు