దేశానికి ఆదర్శం తెలంగాణ

ప్రతి రంగంలోనూ ఆశ్చర్యపోయే విధంగా సమ్మిళిత సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ యావత్‌దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ప్రశంసించారు. 

Updated : 04 Feb 2023 04:59 IST

రాష్ట్రంలో అద్భుత అభివృద్ధి  
ఈ నమూనాపై దేశమంతటా చర్చ
కేసీఆర్‌ పాలనాదక్షత, ప్రజాశీస్సులతో అపూర్వ విజయాలు
గవర్నర్‌ తమిళిసై
ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగం
ఈనాడు - హైదరాబాద్‌

2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.లక్షా 84 వేల కోట్లకు పెరిగింది. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరింది.


తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ఎదిగింది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.

గవర్నర్‌ తమిళిసై

ప్రతి రంగంలోనూ ఆశ్చర్యపోయే విధంగా సమ్మిళిత సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ యావత్‌దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ప్రశంసించారు. ‘అగాథమైన పరిస్థితి నుంచి పురోగమించేందుకు ప్రభుత్వం అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొంది. అస్పష్టతలను, అవరోధాలను అధిగమించింది. ఎనిమిదిన్నరేళ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణ అద్భుత విజయాలను సాధించింది’ అని అన్నారు. తెలంగాణ శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కాగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ పాలనా దక్షత, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం, ప్రజల ఆశీస్సుల వల్లనే తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా, సంక్షేమం, అభ్యున్నతిలో అగ్రగామిగా రూపుదిద్దుకుందని ఆమె వివరించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిని రెట్టింపు చేయడంతో పాటు పెట్టుబడులను అధికం చేసిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి నమూనాపై దేశమంతటా చర్చ నడుస్తోందని అన్నారు.

త్వరలో కోటి ఎకరాల సాగు...

గొప్ప స్థిరీకరణతో రాష్ట్రం భారత వ్యవసాయ రంగంలో నూతనచరిత్రను లిఖించిందని తమిళిసై చెప్పారు. ‘‘మూడున్నరేళ్లలో పూర్తైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నిరంతర విద్యుత్‌, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కొత్త ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలతో సాగు సంపన్నమైంది. 73.33 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం కలిగింది. కోటి ఎకరాలకు మించి సాగునీటినందించే లక్ష్యం త్వరలోనే సాకారమవుతుంది.

ప్రజారోగ్యానికి పెద్దపీట

దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, ఆరోగ్యలక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో అద్భుతమైన పురోగతిని సాధించింది. హైదరాబాద్‌ నగరం నలువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 12 వైద్యకళాశాలను ప్రారంభించగా... మరో తొమ్మిది త్వరలో ప్రారంభం కానున్నాయి.

సబ్బండ వర్గాల సంక్షేమం

దళితబంధు ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల సాయం అందిస్తూ వారి అభ్యున్నతికి దోహదపడుతోంది.. ఆసరా పింఛన్‌ పథకానికి అర్హుల వయసు 57 ఏళ్లకు తగ్గించడం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి కలిగింది. ఎస్టీల రిజర్వేషన్లు 10శాతానికి పెంపు, గొర్రెల యూనిట్ల పంపిణీ, నేతన్నలకు బీమా, షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి తదితర పథకాలతో అన్ని వర్గాలకు చేయూత లభిస్తోంది. రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య 310కి చేరింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. మన ఊరు మన బడి కింద రూ.7,289 కోట్లతో మూడు దశల్లో స్కూళ్లను అభివృద్ధి చేస్తోంది.

ఉద్యోగాల భర్తీ

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2022 వరకు ప్రభుత్వ శాఖల్లో 1,41,735 ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 80వేల ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. ఉద్యోగాల్లో స్థానికత కోసం కొత్త చట్టం తెచ్చాం. సివిల్‌ పోలీస్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా విప్లవా)త్మక పురోగతి సాధించాం. ఎనిమిదిన్నరేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రూ.3.31లక్షల కోట్ల పెట్టుబడ[ులు సమీకరించాం. ఐటీ ఉద్యోగ నియామకాల్లో 140శాతం వృద్ధి సాధించాం.

ఇదే నిబద్ధతతో...

పరిపాలన వికేంద్రీకరణ, సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం సకల మౌలిక వసతులతో కార్యాలయాలన్నింటినీ జిల్లా కేంద్రంలో ఒకేచోట నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడం అభినందనీయం. అంబేడ్కర్‌ ఔన్నత్యం ప్రతిఫలించే విధంగా 125 అడుగుల ఎత్తైన ఆయన విగ్రహం ఏర్పాటవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యల ద్వారా పౌరజీవనం ప్రశాంతంగా సాగుతోంది. దేశంలోనే అత్యధికంగా 9.8 లక్షల సీసీ కెమెరాలతో తెలంగాణ నేరాల నియంత్రణలో ముందుంది. సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా ప్రభుత్వం వేగంగా పయనిస్తోంది. ఇదే స్ఫూర్తి, నిబద్ధతతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది’’ అని గవర్నర్‌ తమిళిసై వివరించారు.


ఎర్రబెల్లికి గులాబీ కండువా కప్పిన కడియం!

భయ సభల సమావేశానికి భారాస సభ్యులు గులాబీ, కాంగ్రెస్‌ వారు త్రివర్ణ, భాజపా వారు కాషాయ కండువాలను, మజ్లిస్‌ సభ్యులు షేర్వానీలు ధరించి వచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీషర్ట్‌తో హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి సభలోకి వస్తుండగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆయనకు గులాబీ కండువాను కప్పారు. ఆయనను తమ పార్టీ భారాసలోకి ఆహ్వానిస్తున్నామని చమత్కరించారు.


తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చరిత్రాత్మక రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 65 లక్షల మందికి రూ.65 వేల కోట్లను పెట్టుబడిసాయం కింద అందిస్తున్న ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి విశ్వవేదిక మీద కొనియాడింది. రైతుబీమా పథకం ప్రపంచంలో ఎక్కడాలేదు. వీటి ద్వారా రైతు సంక్షేమంపై తనకు గల చిత్తశుద్ధిని ప్రభుత్వం చాటుకుంది.

2014-15లో 68.17 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి కాగా అది ఇప్పటికి 2.02 కోట్ల టన్నులకు చేరింది. దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారింది. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయరంగం వాటా 18.2 శాతానికి చేరుకుంది.

ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా విలసిల్లుతున్నాయి. 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తోంది.

ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్‌ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతోంది. 2014-15లో తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్లు కాగా అది 2021-22 నాటికి 2,126 యూనిట్లకు చేరింది.

గవర్నర్‌ తమిళిసై


కాళోజీ కవితతో ప్రారంభం... దాశరథి గేయంతో ముగింపు

సాఫీగా గవర్నర్‌ ప్రసంగం  

ఈనాడు, హైదరాబాద్‌: ఉభయ సభల్లో ప్రసంగించడం కోసం దాదాపు రెండేళ్లకు శాసనసభకు వచ్చిన గవర్నర్‌ తమిళిసైకి సీఎం కేసీఆర్‌, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. శుక్రవారం ఉత్కంఠ మధ్య ప్రారంభమైన ఉభయసభల సమావేశంలో ఆమె ప్రసంగం సాఫీగా సాగింది. గవర్నర్‌ సూచనల మేరకు  ప్రభుత్వం 20 పేజీల ప్రసంగ పాఠాన్ని రూపొందించి ఇవ్వగా ఆమె దానిని యథాతథంగా చదివారు. రాష్ట్రప్రభుత్వంపై ఆద్యంతం ప్రశంసలు, కితాబులతో దాదాపు 40 నిమిషాలు ప్రసంగం సాగింది. ‘పుట్టుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది’ అంటూ కాళోజీ కవితతో గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో.. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో’ అంటూ కవి దాశరథి గేయంలోని చరణాన్ని చదువుతూ జై తెలంగాణ అని ప్రసంగాన్ని ముగించారు. తర్వాత సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆమెను సాగనంపారు. సభలు శనివారానికి వాయిదాపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని