ఓఎంసీలో రాజగోపాల్‌ బావమరిది

ఉమ్మడి రాష్ట్రప్రభుత్వంలో గనులశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి 20 రోజుల ముందే వి.డి.రాజగోపాల్‌ బావమరిది ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)లో ఉద్యోగంలో చేరారని సీబీఐ శుక్రవారం వెల్లడించింది.

Updated : 04 Feb 2023 06:39 IST

ముందుండి లీజు కట్టబెట్టడంలో  కీలక పాత్ర
వి.డి.రాజగోపాల్‌ పిటిషన్‌పై  హైకోర్టులో సీబీఐ వాదన

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రప్రభుత్వంలో గనులశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి 20 రోజుల ముందే వి.డి.రాజగోపాల్‌ బావమరిది ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)లో ఉద్యోగంలో చేరారని సీబీఐ శుక్రవారం వెల్లడించింది. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం మలపనగుడిలో ఓఎంసీకి 68.50 ఎకరాల లీజులు కట్టబెట్టడంలో రాజగోపాల్‌ కీలకపాత్ర పోషించారని తెలిపింది. ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మిపై అవినీతి నిరోధకచట్టం కింద సెక్షన్‌ వర్తించదంటూ ఈ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు. సీబీఐ నమోదుచేసిన ఓఎంసీ కేసులో డిశ్ఛార్జి పిటిషన్‌ను కొట్టేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ వి.డి.రాజగోపాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది ఎన్‌.నాగేంద్రన్‌ వాదనలు వినిపిస్తూ ఎంఎండీఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 11(4) ప్రకారం లీజు నిమిత్తం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఒకేసారి పరిశీలించాల్సి ఉందన్నారు. అయితే రాజగోపాల్‌.. మొదట వచ్చాయని ఓఎంసీ, వినాయక మైనింగ్‌ కంపెనీ దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకున్నారన్నారు. వినాయక మైనింగ్‌ కంపెనీ గాలి జనార్దన్‌రెడ్డి మామ (పరమేశ్వరరెడ్డి)దేనని, ఈ రెండింటిలో మెరుగైన కంపెనీగా ఓఎంసీని ఎంపికచేసి లీజు కట్టబెట్టారన్నారు. మిగిలిన 23 దరఖాస్తులను పట్టించుకోలేదన్నారు. ఏపీఎండీసీ వైస్‌ఛైర్మన్‌, ఎండీ హోదాలో 25 హెక్టార్లలో మైనింగ్‌ కోసం దరఖాస్తు చేసిన రాజగోపాల్‌ లీజు కేటాయింపులో ఎందుకు ఉత్సాహం చూపలేదన్నారు. తనకు, మరొకరికి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించినా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1)(డి) వర్తిస్తుందన్నారు. ఈ కేసులో ఓఎంసీకి లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. కేసును విచారించడానికి ఈ కారణాలు చాలని, అందువల్ల రాజగోపాల్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.


విధుల్లోకి వచ్చేనాటికే దరఖాస్తులు: రాజగోపాల్‌

నుల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేనాటికే మలపనగుడి సర్వే నం.1, 2లలో 93 హెక్టార్ల లీజుకు నోటిఫికేషన్‌ జారీ అయిందని రాజగోపాల్‌ తరఫు న్యాయవాది చెప్పారు. అప్పటికే దరఖాస్తులు అందాయని, ఆయన వచ్చాక అధికారిగా తదుపరి ప్రక్రియను కొనసాగించారన్నారు. పిటిషనర్‌ ఏపీఎండీసీ వీసీ, ఎండీగా ఉన్నప్పుడు 25 హెక్టార్లలో లీజుకు దరఖాస్తు చేశారన్నారు. అలా దరఖాస్తు చేయకపోతే 93.5 హెక్టార్లు కూడా ఓఎంసీకే దక్కేదన్నారు. ఫోర్జరీ కింద అభియోగం మోపారని, ఫోర్జరీ చేసినట్లు ఎలాంటి పత్రాన్ని చూపలేదన్నారు. ఇదే కేసులో శ్రీలక్ష్మి ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలు చూపకపోవడంతో ఈ కోర్టు కేసు కొట్టేసిందన్నారు. శ్రీలక్ష్మి మరిది రాకేశ్‌ ఈ కాలంలో ప్రయోజనాలు పొందారని సీబీఐ ఆరోపించినా రికార్డులేవీ సమర్పించలేదని హైకోర్టు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. కుట్రలో పాల్గొన్నట్లు కూడా ఆధారాలు చూపలేదని, అందువల్ల తనపై కేసును కొట్టేయాలని కోరారు. వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేస్తూ, రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని