సంక్షిప్త వార్తలు(10)

తెలంగాణ బడ్జెట్‌లో దివ్యాంగులకు కేటాయింపులు పెంచాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక  అధ్యక్షుడు కె.నాగేశ్వర్‌రావు కోరారు.

Updated : 04 Feb 2023 05:28 IST

బడ్జెట్‌లో దివ్యాంగులకు కేటాయింపులు పెంచాలి

అఖిలభారత హక్కుల వేదిక వినతి

తెలంగాణ బడ్జెట్‌లో దివ్యాంగులకు కేటాయింపులు పెంచాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక  అధ్యక్షుడు కె.నాగేశ్వర్‌రావు కోరారు. నిరుటి బడ్జెట్‌ కంటే పదిశాతం నిధులివ్వాలని అభ్యర్థించారు. శుక్రవారం తమ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.


స్పౌజ్‌ కేటగిరీలో మరో 124 మంది ఉపాధ్యాయుల బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: ఈనాడు, హైదరాబాద్‌: మరో 124 మంది ఉపాధ్యాయులను స్పౌజ్‌ కేటగిరీ కింద బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మేడ్చల్‌, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్‌ తదితర 12 జిల్లాలకు 427 మంది స్కూల్‌ అసిస్టెంట్లను స్పౌజ్‌ కేటగిరీ కింద బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 124 మందికి కూడా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో కూడా దాదాపు 100 మంది వరకు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకే రానున్నారు. వారందరూ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే స్కూల్‌ అసిస్టెంట్లే. ఇక ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు అనుమతి ఇస్తే మరికొన్ని వందల మంది ఈ రెండు జిల్లాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలపై నిపుణుల కమిటీల నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో నెలకొల్పనున్న ఇంజినీరింగ్‌ కళాశాలలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది. మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తామని, వచ్చే  విద్యా సంవత్సరం (2023-24) నుంచే తరగతులు ప్రారంభిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటితోపాటు కొత్తగూడెంలో కాకతీయ విశ్వవిద్యాలయం కింద పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ కళాశాలలో హాస్టళ్లు, ఇతర వసతులు కల్పించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఈక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఒక్కో కళాశాల కోసం ఒక్కో  నిపుణుల కమిటీని ఉన్నత విద్యామండలి నియమించింది.


రాష్ట్రంపై మళ్లీ చలిపులి పంజా  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. కొద్ది రోజులుగా క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి. గురువారం తెల్లవారు జామున దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలలోపు నమోదయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ యులో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 8 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం నుంచి సోమవారం వరకు ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పది డిగ్రీల వరకు, ఇతర జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.


‘కంటివెలుగు’లో 1152 మంది పోలీసులకు పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పది రోజులపాటు ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరంలో 1152 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి నేత్ర వైద్యపరీక్షలు నిర్వహించారు. శిబిరం ముగింపు సందర్భంగా డీజీపీ అంజనీకుమార్‌ శుక్రవారం వైద్యాధికారులు, సిబ్బందిని అభినందించారు. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ సంజయ్‌కుమార్‌ జైన్‌, పీ అండ్‌ ఎల్‌ డీఐజీ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శాసనసభలోనూ శిబిరం

శాసనసభ ప్రాంగణంలోనూ కంటివెలుగు శిబిరాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రి హరీశ్‌రావు తాజాగా స్పీకర్‌ పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో చర్చించారు.


విజయవంతంగా పొదుపు ఖాతాల మహామేళా

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ తపాలా ప్రాంతీయ పరిధిలో ‘ఒక రోజులో ఒక కోటి పోస్టాఫీసు పొదుపు ఖాతాల మహామేళా’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పోస్టాఫీసు సహాయ డైరెక్టర్‌ సీహెచ్‌ రామకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 1న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఒక్కరోజులోనే రూ. 54.50 లక్షల విలువైన 1882 పీఎల్‌ఐ పాలసీలు జారీ చేశామన్నారు.


రూ.2 వేల కోట్ల రుణానికి బాండ్ల వేలం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్ల వేలం వేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. వీటిలో రూ.500 కోట్లను తొమ్మిదేళ్లలో, 500 కోట్లను పదేళ్లలో, మిగిలిన రూ.వెయ్యి కోట్లను 25 ఏళ్లలో తెలంగాణ తిరిగి చెల్లిస్తుందని వివరించింది. బాండ్ల వేలం వివరాలను ఈ నెల 7న వెల్లడించనున్నట్లు తెలిపింది. మొత్తం 12 రాష్ట్రాలకు అవసరమైన రూ.20,250 కోట్లకు సంబంధించి బాండ్లను వేలం వేస్తున్నట్లు తెలిపింది.


హెల్ప్‌డెస్క్‌ కోఆర్డినేటర్‌ పోస్టుకు ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లో సహాయ కేంద్ర(హెల్ప్‌డెస్క్‌) సమన్వయకర్త పోస్టుకు అర్హులైన ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ బి.శైలజ తెలిపారు. పొరుగుసేవల విధానంలో ఈ పోస్టును భర్తీ చేయనున్నట్లు, నెలకు రూ.50 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌, సోషియాలజీ, సైకాలజీ, సోషల్‌వర్క్‌లో డిగ్రీ చేసిన వారు ఈ పోస్టుకు అర్హులన్నారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆ మేరకు అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈ నెల 10లోగా పోస్టు ద్వారా కానీ, దరఖాస్తులు నేరుగా మలక్‌పేటలోని డైరెక్టరేట్‌ కార్యాలయంలో కానీ అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-24559048 నంబర్లో సంప్రదించాలన్నారు.


నవీన్‌మిత్తల్‌ను కొనసాగించాలని ప్లకార్డుల ప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు పూర్తయ్యేవరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌గా నవీన్‌మిత్తల్‌ను కొనసాగించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అధ్యాపకులు భోజన విరామ సమయంలో ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు వినతిపత్రాలు అందజేశారు.


విశాఖ రాజధాని అనడం ‘ధిక్కారమే’

ఏపీ సీఎం జగన్‌పై సుప్రీంకు   ఆ రాష్ట్ర  హైకోర్టు న్యాయవాది లేఖ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. రాబోయే రోజుల్లో మన రాజదాని కాబోతున్న విశాఖపట్నానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానంటూ జనవరి 31న దిల్లీలో పెట్టుబడిదారుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొనడం న్యాయస్థాన ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్‌ 2(సి)ను ఉల్లంఘించినట్లేనని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మాటల ద్వారా సుప్రీం కోర్టు అధికారాన్ని ఆయన ధిక్కరించారని స్పష్టమైందన్నారు. ఈ దృష్ట్యా ఆయనపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు