ధాన్యం భళా.. పత్తి డీలా?

వానాకాలం(ఖరీఫ్‌)లో తెలంగాణలో పత్తి సాగులో దిగుబడులు ఆశించిన స్ధాయిలో రాలేదు. జులై నుంచి అక్టోబరు దాకా కురిసిన భారీ వర్షాలు, తెగుళ్లు ఆ పంటపై తీవ్ర ప్రభావమే చూపాయి.

Published : 04 Feb 2023 04:36 IST

వానాకాలంలో ఎకరాకు 20.99 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి
ఎకరా పత్తికి సగటు దిగుబడి 5.68 క్వింటాళ్లే
గణాంకశాఖ అంచనాల్లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం(ఖరీఫ్‌)లో తెలంగాణలో పత్తి సాగులో దిగుబడులు ఆశించిన స్ధాయిలో రాలేదు. జులై నుంచి అక్టోబరు దాకా కురిసిన భారీ వర్షాలు, తెగుళ్లు ఆ పంటపై తీవ్ర ప్రభావమే చూపాయి. ఎకరానికి సగటున 5.68 క్వింటాళ్లే దిగుబడి వచ్చినట్టు గణాంక శాఖ అంచనాల్లో వెల్లడైంది. అదే సమయంలో వరిలో దిగుబడులు ఆశించిన స్థాయిలోనే వచ్చినట్టు తేలింది. క్షేత్రస్థాయిలో నమూనా కోతలు కోసి ఈ మేరకు ఆ శాఖ అంచనాలు రూపొందించింది. గత వానాకాలం, ప్రస్తుతం కొనసాగుతున్న యాసంగి(రబీ) సీజన్లలో ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడుల తాలూకూ అంచనాలు సిద్ధం చేసింది.

ఆ ప్రకారం

వానాకాలంలో వరిలో ఎకరానికి సగటున 20.99 క్వింటాళ్ల ధాన్యం పండగా, యాసంగిలో ఎకరానికి 22.12 క్వింటాళ్లు పండే అవకాశం ఉంది. ‘సాధారణంగా యాసంగిలో గతంలో ఎకరానికి సగటున 20 క్వింటాళ్లే ధాన్యం దిగుబడి వచ్చేది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం వల్ల సుమారు రెండు క్వింటాళ్లు అధికంగా పండే సూచనలున్నాయి’ అని ఆ శాఖ అంచనాకు వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు పంట కాలాల్లో కలిపి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 2.58 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వెల్లడించింది.

వరి వైపే మొగ్గు

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతుండటం, అంతర్జాతీయ విపణిలోనూ గిరాకీ ఉన్నందున ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణకు వానాకాలంలో కోటీ 36 లక్షల టన్నులకు పైగా ధాన్యం పండగా 64.30 లక్షల టన్నులే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించారు. మిగిలినదంతా ప్రైవేటు వ్యాపారులే కొన్నారు. ‘దీంతో యాసంగిలోనూ వరి సాగుకే రైతులు అధికంగా మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత యాసంగిలో వరి 55 లక్షల ఎకరాలకుపైగా సాగయ్యే(సాధారణ సాగు విస్తీర్ణం 33 లక్షల ఎకరాలు) అవకాశం ఉందని’ గణాంకశాఖ అంచనాకు వచ్చింది.

పత్తిని దెబ్బతీసిన వాతావరణం...

అధిక పెట్టుబడి ఖర్చులతో అరకోటి ఎకరాల్లో రైతులు సాగుచేసిన పత్తి పంటను ప్రతికూల వాతావరణం దెబ్బతీసింది. అధిక వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునగడంతోపాటు తేమ, తెగుళ్లతో పూత, కాత దెబ్బతిని ఉత్పాదకత 5.68 క్వింటాళ్లకే పరిమితమైంది. ‘క్వింటా పత్తికి మద్దతు ధర రూ.6,300. ఈ ధర లభించినా ఎకరానికి రైతుకు సగటున సుమారు రూ.35,784 మాత్రమే రాబడి వచ్చింది. ఎకరా పత్తి సాగుకు పెట్టుబడి అంతకుమించి అవుతున్నందున ఈ పంట వేసిన రైతులకు ఏమీ మిగిలే పరిస్థితి లేదని’ గణాంక శాఖ విశ్లేషించింది. మొక్కజొన్న రెండు పంట కాలాల్లో 11.72 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.62 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు