KTR: దేశమంటే ప్రధాని.. అదానీయేనా?

కేసీఆర్‌ది కుటుంబపాలన అని కొందరు విమర్శిస్తున్నారు. అవును మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే. ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతకు పింఛన్‌ ఇస్తున్నారు కేసీఆర్‌..కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో కొత్త వెలుగు చూపుతున్న పెద్దకొడుకు కేసీఆర్‌.

Published : 05 Feb 2023 05:48 IST

దోస్త్‌ దొంగతనాన్ని బయటపెడితే దేశంపై దాడి అంటారా?
అండగా ఉండాల్సిన కేంద్రమే రాష్ట్రానికి గండంగా మారింది
అసెంబ్లీ, మండలిలో మంత్రి కేటీఆర్‌ విమర్శల దాడి
ఈనాడు, హైదరాబాద్‌


కేసీఆర్‌ది కుటుంబపాలన అని కొందరు విమర్శిస్తున్నారు. అవును మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే. ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతకు పింఛన్‌ ఇస్తున్నారు కేసీఆర్‌..కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో కొత్త వెలుగు చూపుతున్న పెద్దకొడుకు కేసీఆర్‌. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో 12 లక్షల మంది పేదబిడ్డలకు పెళ్లి చేసిన వారి మేనమామ కేసీఆర్‌. తెలంగాణతో కేసీఆర్‌కున్న పేగుబంధాన్ని ఎవరూ విడదీయలేరు.

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌


ప్రధాని మోదీ దోస్త్‌ దొంగతనాన్ని బయటపెడితే...దేశంపై దాడిగా అభివర్ణిస్తున్నారని, దేశమంటే ప్రధాని...అదానీయేనా? అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశమంటే 140 కోట్ల మంది ప్రజలని, వాళ్లకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై  ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రభుత్వం తరఫున ఆయన శాసనసభలో, మండలిలో సమాధానమిచ్చారు. ‘ఈ ఏడాది ఆఖరులోగా ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర రెండో ప్రభుత్వంలో ఆఖరి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు. ఎనిమిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్రం సాధించిన విజయాలను వివరిస్తూనే ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కాదని...డబుల్‌ ఇంపాక్ట్‌ సర్కార్‌ అన్నారు. మోదీ ప్రధాని అయ్యేనాటికి ముడిచమురు బ్యారెల్‌ ధర 90 డాలర్లు ఉందని...మధ్యలో పెరిగి మళ్లీ 90కి తగ్గినా చమురు ధర మాత్రం తగ్గడం లేదన్నారు. పైగా పెట్రోల్‌ ధర రూ.70 నుంచి రూ.110కి పెరిగిందని అన్నారు. శాసనసభలో కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

మోదీ..ఎలా దేవుడయ్యారు?

‘‘ప్రధాని మోదీ దేవుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నారు. సిలిండర్‌ ధర రూ.400 నుంచి రూ.1200కు పెంచినందుకా? నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నందుకా? చేనేత రంగంపై పన్ను వేసినందుకా?...రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి చేయనందుకా? రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ ఇవ్వనందుకా? మరి ఎవరికి, ఎందుకు దేవుడయ్యాడు?

కంటివెలుగు అద్దాలు రాష్ట్రంలోనే తయారీ

మేక్‌ ఇన్‌ ఇండియా అనేది ఏమైందో...ఎక్కడుందో? తెలియదు..మేం మాత్రం రాష్ట్రాన్ని ప్రతి వస్తువు ఇక్కడే తయారయ్యేలా మేడ్‌ ఇన్‌ తెలంగాణగా మార్చాం. కంటి వెలుగు అద్దాలు కూడా రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. దేశ జనాభాలో 2.5 శాతం జనాభా ఉన్నా...జీడీపీలో 5 శాతం వాటా రాష్ట్రం ఇస్తోంది. అయినా అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం గండంగా మారింది. నరేగా నిధులు రూ.1100 కోట్లు రాకుండా తొక్కిపెడుతోంది.ఎన్ని చేసినా తెలంగాణ ప్రగతిని అడ్డుకోలేరు. 

బీసీలకు కనీసం 5 శాతం నిధులైనా కేటాయించరా?

ఉచితంగా ప్రజలకు ఇవ్వడం మంచిది కాదని ప్రధాని మోదీ అంటున్నారు. కానీ మోదీ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మంచోడు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీ సంక్షేమం కోసం పోరాడుతున్నారు. కేంద్రబడ్జెట్‌లో 5 శాతం సొమ్ములైనా బీసీలకు కేటాయించి, బీసీ మంత్రిత్వశాఖను ప్రత్యేకంగా పెట్టాలని కోరినా ప్రధాని పట్టించుకోలేదని ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. మోదీ కూడా ఓబీసీ వర్గానికి చెందినవారే అయినా బీసీల కోసం కనీసం 5 శాతం నిధులైనా కేటాయించకపోవడం సిగ్గుచేటు. గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు నాలుగు గనులు ఇచ్చిన కేంద్రం సింగరేణికి ఇవ్వాలని కోరితే వేలంలో పాల్గొని తీసుకోండని చెబుతోంది. కేంద్రం తీరులో సమదృష్టి లోపించింది.

పసిబిడ్డ తెలంగాణ దేశానికే దీపస్తంభమైంది

పదేళ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ ఈరోజు యావత్‌ దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారింది. నాటి తెలంగాణ... ఉద్యమ శాస్త్రానికి టీచింగ్‌ పాయింట్‌ అయితే నేటి సముజ్వల తెలంగాణ... ఉత్తమ పాలనలో దేశానికే టీచింగ్‌ పాయింట్‌. సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధిని ప్రతీ పల్లెకు చేర్చిన మా ప్రభుత్వ ఉద్యోగులందరికీ సలాం. దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిన రైతన్నకు సలాం. ప్రగతి యజ్జంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. వ్యవసాయ రంగంలో  విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అందుకే దేశం మొత్తం కేసీఆర్‌ వైపు చూస్తోంది.

నిమ్స్‌లో అదనంగా 2 వేల పడకలు

ఇప్పటివరకు హైదరాబాద్‌లో మూడు ప్రధాన ఆసుపత్రులే ఉండేవి. నగరానికి నలుదిక్కులా గచ్చిబౌలి, ఎర్రగడ్డ, అల్వాల్‌, కొత్తపేటల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని నిర్మిస్తున్నాం. నిమ్స్‌లో రూ.1500 కోట్లతో 2 వేల పడకలను అదనంగా నిర్మిస్తున్నాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేసి తీరుతాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరేళ్లలో ఆఫ్‌లైన్‌ ద్వారా 32 లక్షల భూ కార్యకలాపాలు జరగగా... ధరణి తర్వాత గత ఏడాదిన్నరలోనే 29 లక్షలు జరిగాయి. సీఎం సమర్థ నాయకత్వానికి అది ఉదాహరణ. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం, మండలాలు, పంచాయతీల ఏర్పాటు, పల్లెల్లోనూ పార్కులు, నర్సరీలు, వైకుంఠధామాలు...ఇలా ఎన్నో చేసి రూపురేఖలు మార్చాం’’ అని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

అయితే రాహుల్‌ గాంధీ మంచి వ్యక్తి...

‘హమ్‌ దో...హమారా దో’ అని ప్రధాని అంటున్నారని కేటీఆర్‌ అనగా కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్క స్పందిస్తూ ఆ నినాదాన్ని తమ నేత రాహుల్‌ గాంధీ ఇచ్చారని చెప్పారు. కేటీఆర్‌ తిరిగి స్పందిస్తూ ‘అయితే రాహుల్‌గాంధీ మంచి వ్యక్తి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి’ అని అన్నారు.


చేతనైతే కృతజ్ఞతలు చెప్పండి

ఒక కేంద్ర మంత్రి వచ్చి రేషన్‌ షాపులో మోదీ ఫొటో ఏదని ప్రశ్నించారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో రూ. 2.25 లక్షల కోట్లు ఇచ్చాం. మరి యూపీ వెళ్లి అక్కడ కేసీఆర్‌కు ధన్యవాదాలు అని బోర్డులు పెట్టిస్తారా? చేతనైతే కృతజ్ఞతలు చెప్పండి... ఇలా వెటకారపు మాటలు మాట్లాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం. ఇలా మాట్లాడితే ఇటుకలు, రాళ్లతో కొట్టినట్లు సమాధానం చెబుతాం.


విషం నింపడం కాదు... ప్రతి ఇంటికీ నీళ్లివ్వండి

హర్‌ ఘర్‌ జల్‌ అని డైలాగులు చెప్పడమే తప్ప కేంద్రం నీళ్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో మాత్రం ఫ్లోరైడ్‌ లేకుండా తరిమికొట్టాం. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రతి గుండెలో విషం నింపడం కాదు..ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వండి. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కూడా ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో విఫలమైంది.

అసెంబ్లీలో కేటీఆర్‌


తెలంగాణ కంటే మెరుగైన విధానం దేశంలో ఉందా?

దర్యాప్తు సంస్థల్ని వేటకుక్కల్లా ఉసిగొలిపేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గొప్ప నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజాబలం ముందు ఏ బలం నిలవదు. వాగాడంబరం, రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం...ఆకట్టుకునే ప్రసంగాలు చేయడం సులభం. కానీ ఒక లక్ష్యం, చిత్తశుద్ధితో కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అనేక మైలురాళ్లు దాటింది. కరెంటు కష్టం లేదు. ఉగ్రవాదం లేదు. మత ఘర్షణల మచ్చలేదు. తెలంగాణ కంటే మెరుగైన విధానం దేశంలో ఉందా?

మండలిలో మంత్రి కేటీఆర్‌


గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ కాదు.. గోల్డెన్‌ తెలంగాణ విధానాన్ని ప్రజల ముందుంచుతాం

దేశానికి కావాల్సింది గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గోల్డెన్‌ తెలంగాణ విధానాన్ని దేశ ప్రజల ముందు పెడతామని ఆయన తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన శనివారం శాసనమండలిలో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని..సింగరేణి సంస్థ గొంతు నులిమేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ‘కేంద్రంలో ఉన్న వారికి రైతులంటే ఇష్టం లేదు. ప్రధాని మనసులో తెలంగాణకు స్థానం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును గుర్తించట్లేదు. ఎనిమిదిన్నరేళ్లుగా అడుగుతున్నా జాతీయహోదా ఇవ్వలేదు. కృష్ణా నదిలో 495 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అయిదోరోజే లేఖ రాస్తే ఇప్పటివరకు కేటాయింపులు చేయలేదు. కేసులతో కుట్రలు చేసినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం. కొవిడ్‌ తర్వాత దేశంలో పేదరికం పెరిగిపోయింది. నైజీరియాను మించి ఇక్కడ పేదలున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఒక్క మాట కూడా అనడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్నే బద్నాం చేస్తున్నారు. తెలంగాణను చూసి దేశంలోని నిఫుణులు, ఆర్థికవేత్తలు ప్రశంసిస్తున్నారు. ఆ ప్రగతి ఇక్కడున్న కొందరికి కనిపించడం లేదు. కంటివెలుగు క్యాంప్‌ను ఇక్కడ  కూడా ఒకటి ఏర్పాటుచేద్దాం. చత్వారం ఉన్నవారికి కళ్లద్దాలు ఇప్పిద్దాం’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీపై స్పందిస్తూ కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అంతకుముందు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. దీన్ని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ బలపరిచారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు