రేకుల డబ్బా కూల్చివేతపై మనస్తాపం.. తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

సిద్దిపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటైన అక్బర్‌పేట-భూంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట శనివారం ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

Published : 05 Feb 2023 03:56 IST

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటైన అక్బర్‌పేట-భూంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట శనివారం ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూంపల్లి గ్రామానికి చెందిన తిప్పనబోయిన బాలరాజు (55)కు 20 ఏళ్ల కిందట రామాయంపేట-సిద్దిపేట ప్రధాన రహదారికి ఆనుకొని 27 గుంటల లావణి భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయిదేళ్ల కిందట తగిన భూమి లేదా పరిహారం ఇస్తామని 20 గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అతిథి గృహం నిర్మించింది. బాలరాజు మిగిలిన ఏడు గుంటల భూమిలో రేకులతో ఇల్లు నిర్మించుకొని అందులోనే హోటల్‌ నడుపుతూ జీవిస్తున్నారు. కొత్త మండలం కావడంతో అక్బర్‌పేట-భూంపల్లి తహసీల్దారు కార్యాలయాన్ని అతిథిగృహంలో ఏర్పాటు చేశారు. బాలరాజు తన అధీనంలో ఉన్న భూమిలో రేకుల డబ్బా ఏర్పాటు చేశారు. దీన్ని ఇంటర్నెట్‌ సెంటర్‌కు అద్దెకివ్వాలని భావించగా.. రెవెన్యూ అధికారులు ముందుగానే నోటీసులిచ్చారు. శనివారం డబ్బాను తొలగించడంతో బాలరాజు కుటుంబసభ్యులతో కలిసి తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆవేశంలో ఆయన పురుగుమందు తాగి కిందపడిపోయారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు వచ్చి.. అతడిని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై తహసీల్దారు వీరేశం మాట్లాడుతూ.. ‘లావణి భూమిలో అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టే హక్కు లేదు. ఈ స్థలాన్ని ఖాళీ చేస్తే రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని చెప్పాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రేకుల డబ్బాను తొలగించాం’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు