ఇక ‘మధ్యాహ్న భోజన’ కార్మికుల వేతనం రూ.3 వేలు

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే మహిళా వంట కార్మికుల నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారు.

Published : 05 Feb 2023 03:56 IST

రాష్ట్రవ్యాప్తంగా 54,201 మంది పేద మహిళలకు ప్రయోజనం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే మహిళా వంట కార్మికుల నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నం.8 జారీ చేశారు. వంట కార్మికులకు ప్రస్తుతం కేంద్రం రూ.600, రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కలిపి నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనాన్ని అందిస్తున్నారు. తమ వేతనం 2008 నుంచి పెరగలేదని, జీతం పెంచాలని ఎప్పటి నుంచో కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ గత మార్చి 15న వారి వేతనాన్ని రూ.3 వేలకు పెంచుతామని శాసనసభలో ప్రకటించారు. కానీ దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయకపోవడంతో కార్మికులు ఎదురుచూస్తున్నారు. దీనిపై ‘ఈనాడు’ పత్రికలో జనవరి 21న ‘వేతన పెంపు హామీ ఏమైంది?’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన ప్రభుత్వం శుక్రవారం రాత్రి జీవో జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 26 వేల పాఠశాలల్లోని 54,201 మంది పేద మహిళలు లబ్ధి పొందనున్నారు. కొత్త జీతంలో కేంద్రం వాటా రూ.600 మాత్రమే ఉంటుంది. కాగా కొత్త వేతనం అమలు ఎప్పటి నుంచి అనేది జీవోలో లేకపోవడం గమనార్హం. వంట కార్మిక నేతలు మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే పెరిగిన వేతనం అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. తమ వేతనం పెంచినందుకు మధ్యాహ్న భోజనం వంట కార్మికుల సంఘం రాష్ట్ర నేతలు వడ్ల హనుమాన్లు, బాబాయమ్మ, మంజుల తదితరులు శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని