రాష్ట్ర బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు!

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఆదివారం ఉదయం 10.30కి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలపనుంది.

Updated : 05 Feb 2023 04:24 IST

పద్దుపై కొనసాగుతున్న కసరత్తు
నేడు మంత్రిమండలి ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఆదివారం ఉదయం 10.30కి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలపనుంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది భారాస ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మంత్రివర్గంలో చర్చించి ఏ రంగానికెంత కేటాయించాలనేది నిర్ణయించనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌ సుమారు రూ.3 లక్షల కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. రైతన్నకు దన్నుగా నిలిచే పథకాలకు, సంక్షేమ రంగాలకు, గృహనిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. పంట రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. సాగునీటి రంగానికి సుమారు రూ.10 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. రుణాల రూపేణా మరో రూ.10 వేల కోట్లు సేకరించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలకు వడ్డీ, అసలు కోసం రూ.10 వేల కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. వ్యవసాయశాఖ నుంచి రూ.29 వేల కోట్లు, విద్యుత్‌శాఖ నుంచి రూ.15 వేల కోట్లు కావాలని ప్రతిపాదనలు అందాయి. ఇంకా సంక్షేమం, దళితబంధు వంటి పథకాలకు కూడా కేటాయింపులు భారీగా ఉండే అవకాశాలున్నాయి. కేటాయింపులు ఎలా ఉండాలనే అంశంపై ఆర్థికశాఖ వర్గాలు శనివారం సాయంత్రం కూడా కసరత్తు చేస్తున్నాయి. మంత్రివర్గం సూచనల మేరకు కేటాయింపుల్లో చివరిక్షణంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దళితబంధు, రైతుబంధు, విద్యుత్‌ రాయితీ పథకాలకు అత్యధిక నిధులు కేటాయించాలని అధికారులు కోరుతున్నారు. ఈ మూడు పథకాలకే రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ కేటాయింపులు కావాలని ప్రతిపాదనలు అందాయి. దీంతో పాటు సొంత జాగా గల వారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థికసాయం పథకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో చేర్చనుంది. దీనికి కేటాయింపులతో పాటు విధివిధానాల గురించి సైతం మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది.


ఆ బిల్లులపైనా చర్చ

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ వద్ద పెండింగులో ఉన్న ఏడు బిల్లుల గురించి చర్చించనుంది. ఉదయం 10.30 నుంచి గంట సేపు మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ నాందేడ్‌లో భారాస సభలో పాల్గొనేందుకు విమానంలో బయల్దేరి వెళ్లనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని