నాగర్‌కర్నూల్‌- నంద్యాల రహదారిలో ప్యాకేజీ 1 టెండరు ఖరారు

కృష్ణా నదిపై కొత్త వారధితో తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు నిర్మించనున్న జాతీయ రహదారి 167కెలో ప్యాకేజీ 1 టెండర్‌ ఖరారైంది.

Updated : 05 Feb 2023 04:45 IST

36.33% తక్కువకు పనులు దక్కించుకున్న ఆర్‌కే ఇన్‌ఫ్రా 

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే: కృష్ణా నదిపై కొత్త వారధితో తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు నిర్మించనున్న జాతీయ రహదారి 167కెలో ప్యాకేజీ 1 టెండర్‌ ఖరారైంది. ఇందులో భాగంగా కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్‌ చౌరస్తా, పెద్దకొత్తపల్లి మీదుగా కొల్లాపూర్‌లోని సింగోటం చౌరస్తా వరకు 79 కిలోమీటర్ల రెండు వరసల రహదారి నిర్మాణానికి రూ.630 కోట్ల అంచనా వ్యయంతో ప్యాకేజీ 1 కింద టెండర్లు పిలిచారు. 36.33 శాతం తక్కువకు టెండర్‌ వేసిన ఆర్‌కే ఇన్‌ఫ్రా కంపెనీ పనులు దక్కించుకున్నట్లు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఈఈ బి.రాజేందర్‌ శనివారం ఫోన్‌ ద్వారా ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ, క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేశామని చెప్పారు.

1.07 కిలోమీటర్ల మేర తీగల వంతెన

ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కొల్లాపూర్‌ తీరంలోని సోమశిల- సిద్ధేశ్వరం గుట్టల మధ్య తీగల వంతెన, ఇరువైపులా బైపాస్‌ రహదారుల నిర్మాణ పనులకు టెండర్లు ఖరారు కావాల్సి ఉందని ఈఈ తెలిపారు. తీగల వంతెనను రూ.1100 కోట్లతో 1.077 కిలోమీటర్ల మేర చేపడతామన్నారు. దీనికి అనుబంధంగా తెలంగాణ ప్రాంతంలో సోమశిల దగ్గర 8 కిలోమీటర్లు, ఏపీలోని సిద్ధేశ్వరం ప్రాంతంలో 5.8కిలోమీటర్ల మేర బైపాస్‌ రహదారుల నిర్మాణ పనులు  చేపట్టడానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ మార్గంలో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ క్రాస్‌రోడ్డు, సింగోటంక్రాస్‌రోడ్డు, సోమశిలరోడ్డు ప్రాంతాల్లో జంక్షన్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని