రాజధానిలో ఉగ్రకుట్రలపై ఎన్‌ఐఏ దృష్టి

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రల పన్నాగంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దృష్టిపెట్టింది.

Published : 06 Feb 2023 04:36 IST

రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ
జాహెద్‌ బృందం ప్రణాళికపై ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రల పన్నాగంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దృష్టిపెట్టింది. హైదరాబాద్‌ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్‌ అలియాస్‌ అబ్దుల్‌.. హుమాయున్‌నగర్‌ వాసి మాజ్‌హసన్‌ ఫరూఖ్‌, సైదాబాద్‌ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని రద్దీప్రాంతాల్లో పేలుళ్లకు, ఉగ్రదాడులకు జాహెద్‌ బృందం కుట్ర పన్నుతోందనే సమాచారంతో ఈ ముగ్గురినీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబరులోనే రిమాండ్‌ చేయటం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌ నుంచి హవాలా రూపంలో నిధులతోపాటు మందుగుండు సామగ్రి సమకూరిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్‌ఐఏ తాజాగా రంగంలోకి దిగింది.

పుష్కరకాలం.. కారాగారవాసం

ఉగ్రకుట్రలకు సంబంధించి జాహెద్‌పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2005లోనే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసులో జైలుకెళ్లాడు. 2004లో రైట్‌వింగ్‌ కార్యకర్తల హత్యకు కుట్రతోపాటు 2012లో జైలు సిబ్బందిపై దాడి ఘటనల్లోనూ అతడిపై కేసులున్నాయి. 2005 నుంచి 2017 వరకు జైల్లోనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసును న్యాయస్థానం కొట్టేయడంతో 2017 ఆగస్టు 10న విడుదలయ్యాడు.

పాకిస్థాన్‌ నుంచి ఘోరీ ఆదేశాలు..

విడుదలయ్యాక కూడా జాహెద్‌ ఉగ్ర ప్రణాళిక రచనల్లో మునిగితేలినట్లు ఇటీవలే హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ వివరాల మేరకు..

హైదరాబాద్‌ నుంచి పారిపోయి పాకిస్థాన్‌లో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులతో జాహెద్‌ సంబంధాలు కొనసాగించాడు.

2020 అక్టోబరులో వ్యక్తిగత ఉగ్రవాదిగా కేంద్రహోంశాఖ ప్రకటించిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్‌ అబూ సూఫియాన్‌.. 2012 బెంగళూరు కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న జాహెద్‌ సోదరుడు మజీద్‌.. సిద్ధిఖీ బిన్‌ ఒస్మాన్‌ అలియాస్‌ అబూ హంజాలా పాకిస్థాన్‌ నుంచే జాహెద్‌కు సూచనలిచ్చారు.

2002లో హైదరాబాద్‌ సాయిబాబా ఆలయం పేల్చివేతకు కుట్ర.. అదే ఏడాది గుజరాత్‌లో అక్షర్‌ధామ్‌ ఆలయంపై దాడి.. ఘట్‌కోపర్‌ బస్సు పేల్చివేత.. 2004లో సికింద్రాబాద్‌ గణేశ్‌ ఆలయం పేల్చివేతకు కుట్ర.. భాజపా అనుబంధ సంఘాల నేతల హత్యకు పన్నాగం.. 2012లో బెంగళూరు, నాందేడ్‌లలో పేలుళ్లకు కుట్ర.. 2015లో అల్‌ఖైదా కుట్ర కేసుల్లో అబూ హంజాలా, ఫర్హతుల్లా ఘోరీ హస్తముందనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ ముగ్గురిపై ఇప్పటికే రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి.

పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఈ ముగ్గురితో జాహెద్‌ వివిధ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ అప్లికేషన్ల ద్వారా సంబంధాలు కొనసాగించాడు.

వారి సూచనలతో హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌కలీమ్‌, ఆదిల్‌ అఫ్రోజ్‌, సమీయుద్దీన్‌, మాజ్‌హసన్‌ ఫారూఖ్‌, అబ్దుల్‌ రవూఫ్‌, వాజిద్‌ఖాన్‌, ఇర్ఫాన్‌, ఉమర్‌ సుబ్రమణ్యంలతో ఉగ్రముఠా ఏర్పాటుచేశాడు.

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల కోసం పాకిస్థాన్‌ నుంచి హవాలా మార్గంలో రూ.40లక్షలు జాహెద్‌కు సమకూరాయి. వీటితో కొన్న ఎన్‌ఫీల్డ్‌ వాహనంతోపాటు రూ.15లక్షల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది సెప్టెంబరు 28న మజీద్‌ పాకిస్థాన్‌ నుంచి జాహెద్‌కు వాట్సప్‌లో కొన్ని ఫొటోలు పంపాడు. హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ హైవేలోని మనోహరాబాద్‌ టోల్‌ప్లాజా వద్ద ఓ రహస్యప్రాంతంలోకి నాలుగు గ్రెనేడ్‌లతో కూడిన కన్‌సైన్‌మెంట్‌ను పంపించినట్లు ఆ వాట్సప్‌ సందేశం సారాంశం.

ఈనేపథ్యంలో సమీయుద్దీన్‌ను జాహెద్‌ మనోహరాబాద్‌కు పంపి వాటిని హైదరాబాద్‌కు తెప్పించాడు. రెండు గ్రెనేడ్లను ఉంచుకొని సమీయుద్దీన్‌, మాజ్‌లకు ఒక్కోటి ఇచ్చి దాచమని చెప్పాడు. వీటిని భాజపా అనుబంధ సంఘాల కార్యకర్తలపై విసిరేందుకు ప్రణాళికలు రచిస్తూ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు చిక్కారు.

వీరి నుంచి స్వాధీనం చేసుకున్న అయిదు సెల్‌ఫోన్లను విశ్లేషణ నిమిత్తం సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని