Telangana Budget 2023: బాహుబలి బడ్జెట్‌!

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర బడ్జెట్‌ తొలిసారిగా రూ.3 లక్షల కోట్ల స్థాయిని దాటనుంది.

Updated : 06 Feb 2023 09:29 IST

రూ.3 లక్షల కోట్లు దాటనున్న పద్దు
సంక్షేమం.. పేదరిక నిర్మూలనకే ప్రాధాన్యం
సొంత రాబడులపై ధీమా
15 నుంచి 17 శాతం వృద్ధిరేటు అంచనా
నేడే రాష్ట్ర బడ్జెట్‌; ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో భారీ బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర బడ్జెట్‌ తొలిసారిగా రూ.3 లక్షల కోట్ల స్థాయిని దాటనుంది. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. సంక్షేమం, పేదరిక నిర్మూలన, అభివృద్ధి దీని లక్ష్యంగా కనిపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది వృద్ధిరేటును 15 నుంచి 17 శాతం మేర అంచనా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో 2023-24 రాష్ట్ర బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు దాటినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు గత ఏడాది కంటే ఈసారి నిధులు పెంచుతున్నట్లు సమాచారం. సొంత రాబడులపై పూర్తి విశ్వాసంతో ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు వచ్చిన రాబడి ఆధారంగా.. ఆర్థికశాఖ వచ్చే ఏడాది పన్నుల ఆదాయాన్ని సుమారు రూ. 1.5 లక్షల కోట్లుగా, పన్నేతర ఆదాయం, రుణాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను మరో రూ. లక్షన్నర కోట్లుగా అంచనా వేసినట్లు తెలిసింది. దళితబంధు, రైతుబంధు, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణంతో పాటు సొంత స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం వంటి కార్యక్రమాలకు అత్యధిక నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని తెలుస్తోంది. వ్యవసాయ రుణమాఫీకి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులను భారీగా పెంచుతూ.. భారీ అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్‌ వెలుపల రుణాలకు ప్రయత్నించనున్నట్లు తెలిసింది.

సొంత రాబడులే కీలకం

కేంద్ర పన్నుల వాటాగా రాష్ట్రానికి రూ.21,470 కోట్లు అందనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులూ రానున్నాయి. భూముల అమ్మకం ద్వారా ఈ ఏడాది రూ.15,550 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేయగా డిసెంబరు వరకు రూ.8000 కోట్ల మేర సమకూరింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భూముల అమ్మకం ద్వారా భారీ రాబడిని సర్కారు ఆశిస్తోంది. అమ్మకం పన్ను రాబడి అంచనాలు రూ.40,000 కోట్లకు పైగా చేరాయి. జీఎస్టీ ఆదాయం కూడా రూ.42 వేల కోట్లను దాటనుంది. ఎక్సైజ్‌ రాబడిలో సాధారణ వృద్ధిరేటుతో అంచనాలు వేశారు. స్టాంపులు- రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం వచ్చే ఏడాది రూ.18 వేల కోట్లు దాటనుందని అంచనా. గనులు, భూగర్భ వనరుల ద్వారా రూ.9000 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.41,000 కోట్లు అంచనా వేయగా వాస్తవంగా అందులో 20 శాతం లోపే వచ్చింది. అయినా వచ్చే ఏడాది కూడా గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌పై ఆశతోనే బడ్జెట్‌ అంచనాలను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం బడ్జెట్‌ వెలుపల రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురావడంతో రూ.55,530 కోట్ల అంచనాల్లో రూ.19,000 కోట్ల మేర కోత పడింది. ఈసారి కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెరగకపోయినా జీఎస్‌డీపీ పెరుగుదలను ప్రభుత్వం భారీగా అంచనా వేస్తోంది.

ఆసుపత్రుల నిర్మాణానికి రూ.4000 కోట్ల రుణం

ఆదివారం సమావేశమైన మంత్రిమండలి 2023-24 బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడంతో పాటు ఇతర అంశాలపై చర్చించింది. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు హైదరాబాద్‌లో నిర్మించే మరో మూడు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.4000 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, సారపాక, ఆసిఫాబాద్‌ సమీపంలోని రాజంపేట గ్రామ పంచాయతీల ఏర్పాటుకు తీర్మానం చేసింది. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆసిఫాబాద్‌ పంచాయతీలోని ఏజెన్సీ గ్రామమైన రాజంపేటను ప్రత్యేక గ్రామపంచాయతీగా మార్చి.. మిగిలిన ప్రాంతాన్ని పురపాలికగా ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని