రెండు పోలింగ్‌ బూత్‌లలో 500 ఓట్ల తొలగింపు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కొందరు బీఎల్వోలు తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

Published : 06 Feb 2023 04:09 IST

అందులో 70%  తెదేపా సానుభూతిపరులవే
ధర్మవరంలో బీఎల్వోల అక్రమాలు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కొందరు బీఎల్వోలు తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నియోజకవర్గ కీలక నేత ఆదేశాలతో ప్రతిపక్షపార్టీ మద్దతుదారుల ఓట్లు ఏరిపారేస్తున్నారు. ముదిగుబ్బ మండలం మల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 89, 90 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 500 వరకు ఓట్లు తొలగించారు. 89వ పోలింగ్‌ బూత్‌లో 251, 90వ పోలింగ్‌ బూత్‌లో 249 ఓట్లు తీసేశారు. వీరంతా గ్రామంలో ఉండటం లేదన్న కారణంతో తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామంలో స్థిరనివాసం ఉన్నవారి ఓట్లు కూడా కొన్ని తీసేశారు. తెదేపా మద్దతుదారులనే లక్ష్యంగా చేసుకుని ఈ పనిచేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వైకాపా సానుభూతిపరుల ఓట్లు మాత్రం అలాగే ఉంచారని విమర్శిస్తున్నారు. మల్లేపల్లిలో తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపు స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరునెలల నుంచి సదరు ప్రజాప్రతినిధి బీఎల్వోలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు మండలంలోని ఓ మహిళా అధికారికి ఈ బాధ్యతలు అప్పగించారు. ఆమె బీఎల్వోలపై ఒత్తిడి తెచ్చి స్థానికంగా అందుబాటులో లేనివారి ఓట్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని