పల్లెసీమల్లో పుస్తకసిరులు

గ్రామీణ విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యేలా వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గోపి కొత్త గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.

Published : 06 Feb 2023 04:09 IST

తొమ్మిది మండలాల్లో గ్రంథాలయాలు
వరంగల్‌ కలెక్టర్‌ కృషితో సాకారం

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యేలా వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గోపి కొత్త గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది జూన్‌లో గ్రంథాలయాల ఏర్పాటు ఆలోచనకు బీజం వేశారు. జిల్లా, విశ్రాంత అధికారులతోపాటు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచీ విరాళాలను సేకరించారు. తొమ్మిది మండలాల్లోని తొమ్మిది ప్రధాన పంచాయతీల్లో వినియోగంలో లేని పది భవనాలను గుర్తించారు. వాటిలో అన్ని వసతులతో గ్రంథాలయాల ఏర్పాటుకు నడుం బిగించారు. పల్లె, పట్టణ ప్రగతి నిధుల నుంచి రూ.లక్ష చొప్పున, కలెక్టర్‌ బ్యాలెన్సింగ్‌ ఫండ్‌ నుంచి ఒక్కో గ్రంథాలయంలో ఫర్నిచర్‌(రెండు బల్లలు, ఒక బీరువా, రెండు ర్యాకులు, రెండు పంకాలు) కొనుగోలుకు రూ.25 వేలు, పుస్తకాలు, పత్రికలకు రూ.20 వేలు వెచ్చించారు.

స్థానిక పంచాయతీ కార్యదర్శి, విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లతో సంయుక్త బ్యాంకు ఖాతా తెరిపించి.. రూ.5 వేల రివాల్వింగ్‌ ఫండ్‌ జమ చేయించారు. దాతలెవరైనా ఈ ఖాతాలోనే విరాళాలను జమ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు రూ.80 వేలు, గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రూ.లక్ష ఇవ్వగా.. ఇతరులు పుస్తకాలను విరాళంగా అందించారు. పంచాయతీ అధికారులు, సర్పంచులు, స్థానిక ప్రముఖులు, యువతతో గ్రంథాలయాల అభివృద్ధి కమిటీలనూ కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. గతంలో సివిల్స్‌కు ఎంపిక కాకముందు తమిళనాడులో పశువైద్యాధికారిగా పనిచేసిన సమయంలో వీలు కుదిరినప్పుడల్లా గ్రంథాలయంలో పుస్తకాలతో గడిపేవాడినని, అదే స్ఫూర్తితో జిల్లాలో లైబ్రరీల అభివృద్ధికి కృషి చేస్తున్నానని గోపి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని