Telangana Budget 2023: సాగుకు భళా..సంక్షేమ కళ
నాడు కరవుకాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు ప్రభుత్వ అసాధారణ కృషితో సుజల, సుఫల, సస్యశ్యామలంగా అవతరించింది.
పేదల గూటికి ప్రాధాన్యం
రూ.90 వేల లోపు వ్యవసాయ రుణాల మాఫీ
దళితబంధు, రైతుబంధు, ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు
స్థానిక సంస్థల ఖాతాల్లోకే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి సొమ్ములు
సొంత రాబడులపై ధీమా
2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్
ఈనాడు - హైదరాబాద్
నాడు కరవుకాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు ప్రభుత్వ అసాధారణ కృషితో సుజల, సుఫల, సస్యశ్యామలంగా అవతరించింది. ఈ పరివర్తనకు సీఎం కేసీఆరే కర్త, కర్మ, క్రియ. నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకొన్న కేసీఆర్ పాలనలో రైతుల కళ్లలో దీనత్వం తొలిగి ధీరత్వం తొణికిసలాడుతోంది.
హరీశ్‌రావు
సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సుమారు ఇరవై శాతం నిధులను సబ్బండ వర్గాల సంక్షేమానికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు నిధులు పెంచింది. వ్యవసాయానికి సింహభాగం నిధులు దక్కాయి. రైతుబంధు, రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్‌కు నిధుల కేటాయింపులో పెద్దపీట వేసింది. పేదల గృహనిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతో పాటు బడ్జెట్ వెలుపల నిధులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేయనుంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పథకాల జోలికి పోకున్నా ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ నిధులను కేటాయించింది. 2018 ఎన్నికల హామీల అమలు లక్ష్యంగా రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేసేందుకు వీలుగా నిధులను కేటాయించింది. దీంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వాటాను పెంచింది. రుణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సొంత రాబడులపై పూర్తి విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను తీసుకువచ్చింది. వృద్ధిరేటును 16 శాతంగా అంచనా వేసి దీనిని రూపొందించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,100 కుటుంబాలు లక్ష్యంగా 118 నియోజకవర్గాల్లో దళితబంధును అమలు చేసేలా రూ.17,700 కోట్లను కేటాయించింది. ఈ పథకానికి నిధుల కేటాయింపులో తొలిస్థానం దక్కింది. తర్వాత స్థానంలో రూ.15,075 కోట్లతో రైతుబంధు నిలిచింది. రాష్ట్రంలో పేదలకు ఇంటి నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలను అందచేసే పథకానికి రూ.12 వేల కోట్లను కేటాయించనుంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో 2.63 లక్షల కుటుంబాలకు ప్రయోజనం అందేలా ఈ నిధుల కేటాయింపు జరిగింది. పల్లెప్రగతి, పట్టణప్రగతి పథకాలకు రూ.4,844 కోట్లను కేటాయించిన ప్రభుత్వం తొలిసారిగా ఈ నిధులను నేరుగా గ్రామపంచాయతీలు, పురపాలికల ఖాతాల్లో జమచేయనుంది. గ్రామీణ, పట్టణ రహదారుల మరమ్మతులు, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. కేసీఆర్ పౌష్టికాహార కిట్ పథకానికి రూ.200 కోట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయాల్లో హాస్టళ్ల వసతి పెంపునకు, మరమ్మతులకు రూ.500 కోట్లను కేటాయించారు. కొత్త ఉద్యోగ నియామకాలను కొనసాగిస్తూ ఈ సారి బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు ప్రకటించారు. విద్యుత్ సబ్సిడీ, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఆర్ అండ్ బీ, గ్రామీణ రోడ్ల నిర్వహణ, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉపకారవేతనాలు, ఆరోగ్యశ్రీ, మిషన్‌భగీరథ నిర్వహణ సహా వివిధ పథకాలకు నిధుల కేటాయింపులు గతంలో కంటే పెరిగాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఈ సారి కేటాయింపులను భారీగా పెంచారు. గత బడ్జెట్‌లో రూ.2,000 కోట్లను కేటాయించగా ఈసారి ఆమొత్తం రూ.10,348 కోట్లకు పెరిగింది. సాగునీటి శాఖకు ఈసారి కూడా దాదాపు గత కేటాయింపులే కొనసాగాయి. ప్రాంతీయ రింగ్‌రోడ్డు, సచివాలయ నిర్మాణం, ఆర్వోబీల నిర్మాణం, హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్ట్, వడ్డీలేని రుణాలు, అర్బన్ మిషన్ భగీరథ, గిరిజన ఆవాసాలకు రోడ్డు సౌకర్యం, కాళేశ్వరం పర్యాటక సర్క్యూట్, ఆయిల్‌పాం సాగు, ఎయిర్‌పోర్టు మెట్రో, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం, హైదరాబాద్ జలమండలికి తోడ్పాటు, యాదగిరిగుట్ట అభివృద్ధి, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్, ఆర్టీసీకి తోడ్పాటుకు ఈ సారి బడ్జెట్‌లోనూ గత కేటాయింపులనే కొనసాగించారు.
సొంతరాబడులపై విశ్వాసంతో ముందుకు
సొంత రాబడులపైనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విశ్వాసం పెంచుకుంది. పన్నుల రాబడిలో 18 శాతం పైగా వృద్ధిరేటును అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.31 లక్షల కోట్ల రాబడిని ఆశిస్తోంది. పన్నేతర రాబడి సవరించిన అంచనాల ప్రకారం గత ఏడాది రూ.15,291 కోట్లు కాగా ఈ సారి రూ.22,808 కోట్లుగా అంచనావేసింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ల రాబడి రూ.42,259 కోట్లు వస్తుందని భావిస్తూ బడ్జెట్ అంచనాలను రూపొందించింది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలపై కేంద్రం ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర రుణ పరిమితిని రూ.40,615 కోట్లుగా అంచనా వేసింది. గత ఏడాదికంటే ఈ మొత్తంలో రూ.4,300 కోట్లను తగ్గించుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్దుబాటుగా రాష్ట్రానికి రావాల్సిన రూ.17,828 కోట్లు వస్తుందని రాష్ట్రం బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఏపీకి కేంద్రం సర్దుబాటు నిధులు రూ.6,500 కోట్లు అందించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సర్దుబాటునిధులు సమకూరుతాయని అంచనా వేసింది. కేంద్ర పన్నులవాటా రూ.21,470 కోట్లుగా పేర్కొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ గత బడ్జెట్ కంటే 18.5 శాతం వృద్ధిరేటు మేరకు రాబడిని రూ.18,500 కోట్లుగా అంచనా వేసింది. ఎక్సైజ్ రాబడిని గతం కంటే రూ.2,384 కోట్లను పెంచి రూ.19,884 కోట్లుగా అంచనావేసింది. వాహనాల పన్నును గతం కంటే రూ.1,100 కోట్లను పెంచి రూ.7,512 కోట్లుగా పేర్కొంది.
నియోజకవర్గాల అభివృద్ధికి అయిదురెట్ల నిధులు
నియోజకవర్గ అభివృద్ధి నిధులకు రూ.800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద రూ.10,348 కోట్లను ప్రకటించింది. గత ఏడాది ఎస్డీఎఫ్ కింద రూ.2,000 కోట్లు కేటాయించగా ఈసారి అయిదు రెట్లు పెంచింది. నియోజకవర్గాలతో పాటు ప్రత్యేకంగా అభివృద్ధి పనులకు అవసరమైన చోట నిధులను కేటాయించేందుకు వీలుగా కేటాయింపులు పెంచారు.
రూ.46 వేల కోట్ల రుణం...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలో రూ.46 వేలకోట్ల రుణాలను తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సొంత పన్నుల రాబడి, పన్నేతర రాబడి, కేంద్ర పన్నుల వాటా అంచనా రూ.1,75,306 కోట్లు కాగా మిగిలిన రూ.1.14 లక్షల కోట్ల మొత్తానికి రుణాలు, గ్రాంట్ ఇన్‌ఎయిడ్, అంతర్రాష్ట్ర సర్దుబాటు నిధులపై ఆధారపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేలకోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఆశించగా డిసెంబరు వరకు రూ.7,700 కోట్లు మాత్రం అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా గరిష్ఠంగా రూ.10వేల కోట్లు మాత్రం సమకూరే అవకాశం ఉన్నా గ్రాంట్ ఇన్‌ఎయిడ్ అంచనాలపై రూ.40 వేలకోట్ల ప్రతిపాదనలు రూపొందించారు. భూముల అమ్మకం ద్వారా పన్నేతర ఆదాయంపై రాష్ట్రం ఆశలు పెంచుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల విద్యుత్ బకాయిలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో ప్రత్యేకంగా పేర్కొంది. చెల్లింపుల అంశంలో రూ.22,407 కోట్లను వడ్డీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వేతనాలు, పింఛన్ల కేటాయింపులు గత బడ్జెట్‌కంటే పెరిగాయి.
తెలంగాణ బడ్జెట్ దేశానికి మార్గదర్శకం
ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త బడ్జెట్ పూర్తిగా ప్రగతిశీలమైందని, ఇది ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని, దేశానికి మార్గదర్శకం అవుతుందని తెలిపారు. సోమవారం బడ్జెట్ ప్రసంగం అనంతరం మంత్రి హరీశ్‌రావును సీఎం తన కార్యాలయంలో అభినందించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులను ప్రశంసించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి వాస్తవిక బడ్జెట్ రూపకల్పనతో తెలంగాణ కొత్త ఒరవడిని సృష్టిస్తోందని, తమ ప్రభుత్వం ఎప్పుడూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. బడ్జెట్‌లో పేర్కొన్న అంశాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.
మొత్తం బడ్జెట్: 2,90,396 (రూ.కోట్లలో)
రెవెన్యూ వ్యయం: 2,11,685
పెట్టుబడి వ్యయం: 37,524
ద్రవ్యలోటు: 38,234
రెవెన్యూ మిగులు: 4,881
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Naatu Naatu Song: ‘నాటు నాటు’ కేవలం ఫాస్ట్ బీట్ మాత్రమే.. అవార్డు వస్తుందనుకోలేదు: కీరవాణి
-
India News
Khushbu Sundar: రాహుల్‌కు జైలుశిక్ష.. వైరల్ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్
-
General News
Hyderabad: సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్
-
Crime News
Hyderabad: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
-
General News
Rahul Gandhi: ‘సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ’.. ఓయూలో నిరసన ర్యాలీ
-
India News
Sukesh- Jacqueline: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచి సుకేశ్ మరో ప్రేమ లేఖ