Telangana Budget 2023: దేశానికే నమూనా
ఆర్థికమాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ
కేంద్రం కల్పించిన అడ్డంకుల్ని అధిగమించి మొదటి స్థానంలో నిలిచాం
ఐటీ వార్షిక ఎగుమతుల్లో 220 శాతం వృద్ధితో తొలిస్థానం
2023-24 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు
ఈనాడు, హైదరాబాద్: ఆర్థికమాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజాసంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ యావద్దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి...‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకొనే స్థాయికి చేరుకోవడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్రం ఆటంకాలు కల్పిస్తున్నా గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. శాంతిభద్రతల సమర్థ నిర్వహణతో దేశంలోనే ఎక్కడా లేనిరీతిలో పెట్టుబడులు సాధ్యమయ్యాయన్నారు. శాసనసభలో సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. హరీశ్‌రావు ప్రసంగం ఉదయం 10.30 గంటలకు ఆరంభమై 12.15 గంటలకు(105 నిమిషాలు) ముగిసింది. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇదే సుదీర్ఘ ప్రసంగం.
ఆర్థికాభివృద్ధిలో ఆదర్శంగా..
తెలంగాణ ఏర్పాటుకు ముందు రెండేళ్లలో రాష్ట్ర జీఎస్డీపీ వార్షిక వృద్ధిరేటు 12శాతమే. ఇది జాతీయ వృద్ధిరేటు 13.4 శాతంకంటే తక్కువ. కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ చర్యలతో 2019-20నాటికి 13.2శాతానికి పెరిగింది. అదే సమయంలో దేశ జీడీపీ 10.2 శాతానికి తగ్గింది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతిఆయోగ్ పేర్కొంది. రాష్ట్రంలో 2022-23లో తలసరి ఆదాయం రూ.3,17,115 ఉండొచ్చని అంచనా. ఇది జాతీయ సగటు రూ.1,70,620కంటే దాదాపు 86 శాతం ఎక్కువ. కేంద్రం కల్పించిన ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూనే.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సమీకరించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని రూ.53,970 కోట్లుగా బడ్జెట్‌లో పొందుపరిచి సభలో ఆమోదించుకున్నా.. కేంద్రం రూ.15,033 కోట్లు కోత పెట్టడం అసంబద్ధం.
దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ
తెలంగాణ ఏర్పాటుకు పదేళ్ల ముందు వ్యవసాయం, అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7,994 కోట్లు ఖర్చు చేశాయి. రాష్ట్రం ఆవిర్భావం నుంచి 2023 జనవరి వరకు రూ.లక్షా 91 వేల 612 కోట్లు ఖర్చు చేశాం. 2014-15లో రాష్ట్రంలో 131.33 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం ఉండగా.. 2020-21నాటికి 215.37 లక్షలకు పెరిగి దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. దేశచరిత్రలో 65 లక్షల మందికి రూ.65 వేలకోట్ల రైతుబంధు నిధులు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే. రైతుబీమా కింద దాదాపు లక్షమందికి రూ.5,384 కోట్ల సాయం అందించాం. ప్రస్తుతం రాష్ట్రంలో 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. వచ్చే మూడేళ్లలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు నీరిచ్చి .. కోటీ 25లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నాం.
* 2021-22లో రూ.5860 కోట్ల విలువైన 3.9 లక్షల టన్నుల మత్స్యసంపద రాష్ట్రప్రభుత్వం సృష్టించిన బ్లూ రివల్యూషన్‌కు నిదర్శనం.
* 21,585 మంది చేనేత.. 43,104 మంది పవర్‌లూమ్ కార్మికులకు జియోట్యాగింగ్ నంబర్లు ఇవ్వడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తున్నాం.
* రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 87 ఎకరాల విలువైన భూముల్లో 41 బీసీల కులాల ఆత్మగౌరవ భవనాల కోసం రూ.95.25 కోట్లు కేటాయించాం.
హర్‌ఘర్ జల్ యోజనకు..భగీరథే స్ఫూర్తి
* 2014లో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు.ప్రస్తుతం 18,453 మెగావాట్లకు పెరిగింది.
* మిషన్ భగీరథతో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించడం ద్వారా తాగునీటి కష్టాలను అధిగమించిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని కేంద్రమే ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు రూ.44,933.66 కోట్ల అంచనాతో అనుమతులిస్తే రూ.36,900 కోట్లే వెచ్చించి పూర్తిచేశాం. ఈ పథకం స్ఫూర్తితోనే ‘హర్‌ఘర్ జల్‌యోజన’ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.
* గురుకులాల విద్యాలయాలకు పెద్దపీట వేయడంతో 1.3 లక్షలున్న విద్యార్థుల సంఖ్య 5.59 లక్షలకు పెరిగింది. మన ఊరు.. మన బడి పథకం కింద 26,065 పాఠశాలల్లో రూ.7,289 కోట్లతో మౌలికసదుపాయాలు సమకూరుతున్నాయి. యూనివర్సిటీల్లో మౌలికవసతుల కల్పనకు రాష్ట్రచరిత్రలోనే తొలిసారిగా రూ.500 కోట్లు కేటాయించాం.
* ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణాది మూడోస్థానం. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే తెలంగాణాది ప్రథమస్థానం. కంటివెలుగు కార్యక్రమాన్ని దిల్లీ, పంజాబ్‌లలో అమలు చేస్తామని అక్కడి సీఎంలు ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం.
* తెలంగాణలోని 12,769 పల్లెల్లో సాధించిన ప్రగతితో పోల్చితే ఏ రాష్ట్రమూ మన దరిదాపుల్లో లేదు.
* యాదాద్రి పుణ్యక్షేత్రం..బుద్ధవనం నిర్మాణం పర్యాటక కేంద్రాలుగా మారాయి. సచివాలయం.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, రూ.178 కోట్లతో అమరవీరుల స్మృతి తెలంగాణ అస్తిత్వాన్ని చాటబోతున్నాయి.
మాది సంక్షేమం.. వ్యాపారం కాదు
సంక్షేమ పథకాలను ఉచితాలంటూ కొందరు అవహేళన చేస్తున్నా వాటిని మానవాభివృద్ధి దృక్పథంతో చూడాలనేది కేసీఆర్ ఆకాంక్ష. ‘హమ్‌తో సర్కార్ చలా రహేహై.. వ్యాపార్ నహీ’ అని సీఎం పేర్కొన్నట్లుగా ఇప్పటివరకు రూ.54,989 కోట్ల ఆసరా పింఛన్లు పంపిణీ చేశాం. దళితుల అభ్యుదయమే లక్ష్యంగా దళితబంధు కోసం రూ.17,700 కోట్లను తాజా బడ్జెట్లో ప్రతిపాదించాం.
ఉత్తమ ఇంక్యుబేటర్‌గా టి-హబ్
రాజధానిలో మౌలికవసతుల కోసం రూ.202.275 కోట్లతో లింక్‌రోడ్ల నిర్మాణం.. ఎస్సార్డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీల నిర్మాణం.. రూ.6,250 కోట్లతో శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ.. రూ.95 కోట్లతో కోకాపేటలో సోలార్ రూఫ్ సైకిల్‌ట్రాక్.. రూ.1,956 కోట్లతో ఓఆర్‌ఆర్ పరిధిలో తాగునీటి ప్రాజెక్టు.. లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు తదితర పనులతో హైదరాబాద్ దశదిశలా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఐటీ, ఇతర పారిశ్రామికరంగాల్లో రూ. 3 లక్షల 31 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 22 లక్షల 36 వేల ఉద్యోగ అవకాశాలు కలిగాయి. గడిచిన ఎనిమిదేళ్లలో ఐటీ వార్షిక ఎగుమతుల్లో 220 శాతం వృద్ధి నమోదు చేసి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. టి-హబ్ దేశంలోనే ఉత్తమ ఇంక్యుబేటర్‌గా నిలిచింది.
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వేముల ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభ వ్యవహారాలు, రహదారులు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. గంటా 43 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు మంత్రి ప్రసంగం మొదలైంది. మధ్యాహ్నం 12.13 గంటలకు ముగిసింది. అనంతరం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలిని బుధవారానికి వాయిదా వేశారు.
విప్లవాత్మక పథకం- దళితబంధు
స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురు ప్రసరించింది. కానీ, ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదు. ఫలితంగా నేటికీ దళితవాడలు వెనకబాటుతనం, పేదరికానికి చిరునామాలుగా ఉండిపోతున్నాయి.దళితజాతి అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే దళితబంధు.
విద్యావికాసంతోనే ముందంజ
విజ్ఞాన ప్రపంచం తలుపులు తెరవడానికి కావాల్సిన సాధనం విద్య. విద్య, జ్ఞానం మనిషికి ఒక గుర్తింపునిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విద్యావంతులతో నిండిన సమాజమే అభివృద్ధి పథంలో వేగంగా పయనిస్తుంది. విద్యావికాసాన్ని సాధించిన సమాజాలు ఇతర రంగాల్లోనూ ముందంజలో ఉంటాయి.
సాగులో స్వర్ణయుగం.. ప్రాజెక్టులతో మాగాణం
‘‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. బాయిలు, బోర్లే దిక్కయిపోయిన రైతాంగం అప్పుల బాధతో ఆత్మహత్యల పాలైంది. పాడుబడిన ఇళ్లు, బీడుపడిన పొలాలతో తెలంగాణ బిక్కచచ్చిపోయింది. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తోంది. అన్నపూర్ణగా అవతరించి దేశానికే అన్నం పెడుతోంది.’’
ఎందుకోసం అధ్యక్షా..?
‘‘ఆదివాసీ, బంజారా భవనాలు నిర్మించినా, సెక్రటేరియట్ భవనాన్ని కట్టినా, ట్యాంక్‌బండ్ తీరాన అమరుల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నా, అంబేడ్కర్ మహాశయుని విగ్రహాన్ని ఆకాశమంత ఎత్తున ప్రతిష్ఠిస్తున్నా.. ఎందుకోసం అధ్యక్షా..? ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందు సమున్నతంగా నిలబెట్టాలనే ఆశయం కోసం.’’
‘నూకల’ మాటలు గాయపరిచాయ్
గత యాసంగిలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సమస్యను సృష్టించింది. యాసంగి వడ్లలో నూకల శాతం అధికం అనే నెపంతో కొనుగోలు చేయలేదు.పైగా తెలంగాణ ప్రజలు నూకలు బుక్కడం అలవాటు చేసుకోవాలన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రజల హృదయాలను గాయపరిచాయి. కేంద్రం చేతులెత్తేసినా రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పంటనంతా కేసీఆర్ కొనుగోలు చేశారు.
టింగు టింగు.. రైతుల ముఖాల్లో ప్రకాశం
సీఎం కేసీఆర్ ఆలోచన వెలుగులో ఆవిష్కృతమైన రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఒకప్పుడు రుణాల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు ఒడిగట్టిన రైతుల హృదయాల్లో ఆశాదీపాలు వెలిగించింది. వారి కన్నీరు తుడిచి కడగండ్లు తీర్చింది. డబ్బులు తమ ఖాతాల్లో జమ అయినట్టు తెలియజేస్తూ ఫోన్‌కు మెసేజ్ రాగానే వచ్చే టింగు టింగు శబ్దం వినగానే రైతుల ముఖాలు ప్రకాశిస్తున్నాయి.
కక్షలు, ఆంక్షలు ఎదుర్కొని..
‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్షను, వివక్షను ప్రదర్శిస్తున్నా.. అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నా.. సంక్షేమం, అభివృద్ధిలో ఏనాడూ కొరత రానివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను కాపాడుతుంది’’
తెలంగాణకు దేశం జేజేలు!
‘‘ఎనిమిదిన్నరేళ్ల తెలంగాణ.. అభివృద్ధిలో దేశం ముందు అపూర్వమైన ఆదర్శాన్ని నిలబెట్టింది. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. అభివృద్ధికి మానవీయ కోణాన్ని అద్దింది. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనాకు దేశం మొత్తం జేజేలు పలుకుతోంది’’
హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: కుమారుల అనారోగ్యంపై మనస్తాపం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
-
India News
పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు
-
India News
Sukesh chandrasekhar: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)