సంక్షిప్త వార్తలు(7)

హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఆరు రోజులపాటు కొనసాగిన ఆదాయపన్ను శాఖ సోదాలు సోమవారం ముగిశాయి.

Updated : 07 Feb 2023 07:23 IST

ముగిసిన ఐటీ బృందాల సోదాలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఆరు రోజులపాటు కొనసాగిన ఆదాయపన్ను శాఖ సోదాలు సోమవారం ముగిశాయి. రాజ్‌పుష్ప, ముప్పా, వెర్టెక్స్‌ వసుధ నిర్మాణ సంస్థల్లో దాదాపు 50 ఐటీ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. వీటిలో భాగంగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో నుంచి పలు కీలకపత్రాల్ని అవి స్వాధీనం చేసుకున్నాయి. నిర్మాణరంగ ప్రాజెక్టుల్లో భాగంగా కొనుగోలుదారుల నుంచి సేకరించిన సొమ్ముకు.. నిర్వాహకులు ఆదాయపన్నుశాఖకు చెల్లించిన పన్నులకు నడుమ తేడాలపై ఆరోపణల నేపథ్యంలో ఈ సుదీర్ఘ సోదాలు జరిగినట్లు తెలిసింది.


మెస్‌ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో విధ్యార్థులకు మరింత మెరుగైన పౌష్టికాహారం అందించడానికి, మెస్‌ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా శాఖాపరంగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నట్లు చెప్పారు. ఈమేరకు సోమవారం శాసనసభ కమిటీ హాలులో వారు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖలవారీగా మెస్‌ఛార్జీలు, ఆహార పంపిణీపై మంత్రులు చర్చించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం వారు ఆర్థికమంత్రి హరీశ్‌రావును కలిశారు. దీనిపై హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు.


నూతన సచివాలయానికి కొత్త సబ్‌స్టేషన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రారంభోత్సవానికి సన్నద్ధమవుతున్న  నూతన సచివాలయానికి కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు 11 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సోమవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


నెలసరి సెలవులిచ్చే ప్రతిపాదన లేదు

దిల్లీ: విద్యాసంస్థల్లో విద్యార్థినులకు నెలసరి (రుత్రుక్రమ) సెలవుల మంజూరీ కోసం చట్టాన్ని తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ తమ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర విద్యాశాఖ తాజాగా వెల్లడించింది.


నల్సార్‌ విశ్వవిద్యాలయంతో ఇక్రిశాట్‌ ఒప్పందం  

ఈనాడు, హైదరాబాద్‌: ఆవిష్కరణల సాంకేతిక నిర్వహణ, మేథోసంపత్తి హక్కులు, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యీకరణ తదితర ప్రాజెక్టులపై కలిసి పనిచేసేందుకు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంతో ఇక్రిశాట్‌ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. విశ్వవిద్యాలయ వీసీ కృష్ణదేవరావు, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జాక్వెలిన్‌ హ్యుజెస్‌లు దీనిపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో నల్సార్‌ ప్రొఫెసర్‌ అనింద్యా సిర్కార్‌, ఇక్రిశాట్‌ న్యాయ సేవల విభాగాధిపతి సూర్యమణిత్రిపాఠి పాల్గొన్నారు.  


జనాభా దామాషాలో బడ్జెట్‌ పెంచాలి: జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో బీసీలకు జనాభా దామాషాలో నిధులను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. 50 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు రూ.20 వేల కోట్లను కేటాయించాల్సి ఉందన్నారు. కేవలం రూ.6,229 కోట్లే కేటాయించడం సరికాదని దీనిని భారీగా పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల బడ్జెట్‌ను మరింత పెంచాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు కోరారు.


తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు నాలుగువేల వీడియో పాఠాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు నాలుగు వేల వీడియో పాఠాలను ఇంటర్‌ విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. జనరల్‌, వొకేషనల్‌తోపాటు సామాన్యశాస్త్రం ప్రయోగ పరీక్షల పాఠాలు, పరీక్షలకు సంబంధించిన టిప్స్‌, ప్రోత్సాహాన్ని ఇచ్చే  ప్రసంగాలను కూడా చేర్చింది. యూట్యూబ్‌లో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఈ-లెర్నింగ్‌ తెలంగాణ’ అని సెర్చ్‌ చేయాలని పేర్కొంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని వార్షిక పరీక్షలకు విద్యార్థులు మరింత సన్నద్ధం కావాలని శాఖ కమిషనర్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని