ఆరోగ్యానికి నిధుల భాగ్యం

వైద్య ఆరోగ్యశాఖకు నిధుల భాగ్యం ఇనుమడించింది. గతేడాది (2022-23) బడ్జెట్‌ కేటాయింపులతో పోల్చితే.. ఈ ఏడాది (2023-24) దాదాపు రూ.923.67 కోట్లను ప్రభుత్వం అధికంగా కేటాయించింది.

Published : 07 Feb 2023 03:46 IST

గత ఏడాది కంటే రూ.923.6 కోట్లు అధికం
మొత్తం బడ్జెట్‌లో వైద్యశాఖకు కేటాయింపులు 4.87 శాతం

ఈనాడు-హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖకు నిధుల భాగ్యం ఇనుమడించింది. గతేడాది (2022-23) బడ్జెట్‌ కేటాయింపులతో పోల్చితే.. ఈ ఏడాది (2023-24) దాదాపు రూ.923.67 కోట్లను ప్రభుత్వం అధికంగా కేటాయించింది. ప్రగతి పద్దు (జీతభత్యాలు మినహా అభివృద్ధి పనులకు కేటాయించిన మొత్తం) మాత్రమే పరిశీలిస్తే.. గతేడాది కంటే రూ.823.93 కోట్ల నిధులను అధికంగా పెంచడం విశేషం. మొత్తం బడ్జెట్‌ కేటాయింపులు పరిశీలిస్తే.. గతేడాది వైద్యశాఖకు 4.3 శాతం నిధులు కేటాయించగా.. ఈ ఏడాది 4.87 శాతానికి పెరగడం ఆహ్వానించదగిన పరిణామమేనని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ వైద్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న వైద్యకళాశాలల కోసం రూ.1,000 కోట్లను కేటాయించింది.హైదరాబాద్‌ నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, ఆల్వాల్‌, ఎర్రగడ్డల్లో రూ.2,679 కోట్లతో నిర్మించనున్న 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా కొత్తగా 4,200 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి అప్పు రూపంలో తీసుకోనున్నారు. దీనికి అవసరమైన మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధుల కోసం రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు రూ.70 కోట్లు, పారిశుద్ధ్య భద్రత నిర్వహణ కోసం రూ.108 కోట్లను ఇచ్చారు. కొవిడ్‌ తదనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాలు, ప్రయోగశాలల్లో వినియోగించే రసాయనాలకు నిధులను భారీగా కేటాయించింది. గత ఏడాది డిసెంబరులో కొత్తగా ప్రారంభించిన ‘కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌’ పథకాన్ని ప్రస్తుతం ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అమలు చేస్తుండగా.. ఈ ఏడాది అన్ని జిల్లాల్లోనూ విస్తరించనున్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. దీనివల్ల రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం చేకూరనుంది. ఆరోగ్యశ్రీ పథకానికిరూ.1,101.00 కోట్లు కేటాయించారు.

* వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం గత నాలుగేళ్లుగా సగటున 75 శాతం విడుదల చేస్తోంది. కేటాయింపుల్లో సుమారు 25 శాతం వరకూ నిధులు విడుదల చేయకపోవడంతో ఆ మేరకు ప్రతికూల ప్రభావం పడింది. 


ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రత్యేక ట్రస్టు

ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాన్ని ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ట్రస్టు లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపిస్తోందనీ, నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందనీ, తామూ 1 శాతం వరకూ వాటా చెల్లిస్తామని చాన్నాళ్లుగా ఉద్యోగస్తులు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ట్రస్టు నెలకొల్పాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు కూడా భాగస్తులవుతారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ బడ్జెట్‌లో ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.211.86 కోట్లు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రూ.150.00 కోట్లు, పాత్రికేయుల ఆరోగ్య పథకానికి రూ.45.83 కోట్లను కేటాయించింది.


ఆరోగ్యంపై తలసరి వ్యయంలో తెలంగాణే ముందంజ

దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. వైద్య ఆరోగ్య రంగంపై తలసరి వ్యయంలో తెలంగాణ ముందంజలో ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2022-23లో వైద్య రంగంపై ప్రభుత్వాలు పెట్టిన వ్యయాన్ని చూస్తే.. తెలంగాణలో రూ.3,335గా నమోదు కాగా.. కేరళలో రూ.2,890, మధ్యప్రదేశ్‌ రూ.2,695, తమిళనాడు రూ.2,434, కర్ణాటక రూ.2,184, ఉత్తర్‌ప్రదేశ్‌ రూ.2,049 , గుజరాత్‌ రూ.1,952, ఆంధ్రప్రదేశ్‌ రూ.1,831, బిహార్‌లో రూ.1,613గా ఉందని వైద్యశాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని