నిధుల పారుదలే!

తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..మరోసారి ఆ రంగానికి పెద్దపీట వేసింది.

Published : 07 Feb 2023 03:46 IST

వచ్చే ఏడు సాగునీటి శాఖకు రూ.26,885 కోట్లు
గతేడు కన్నా సుమారు రూ.6 వేల కోట్లు అదనం
కేటాయింపుల్లో ఎక్కువ మొత్తం వడ్డీలకే..

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..మరోసారి ఆ రంగానికి పెద్దపీట వేసింది. 2023-24వ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.26,885 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఇది సుమారు రూ.6 వేల కోట్లు అదనం. అయితే ఇందులో అధిక మొత్తం ఇప్పటికే తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లించే అసలు, వడ్డీకే పోనుంది. దీంతోపాటు ఇతర నిర్వహణ వ్యయం పోనూ భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల పనుల కోసం సుమారు రూ.పదివేల కోట్లు మాత్రమే ఖర్చుచేయడానికి అవకాశం ఉంటుందని అంచనా. దీన్నిబట్టి చూస్తే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలపైనే పలు ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతి ఆధారపడి ఉండనుంది. మొత్తం నిధుల్లో కాళేశ్వరానికే సింహభాగం కేటాయించారు. రూ.26,885 కోట్లలో రూ.15,200 కోట్లు(సుమారు 60%) దానికే ఖర్చుచేయనున్నట్టు సర్కారు పేర్కొంది. అయితే, అందులో రూ.12,500 కోట్లు ఇప్పటివరకు కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణానికి వడ్డీతోపాటు అసలు తిరిగి చెల్లించడానికి వెచ్చించనున్నారు. వాస్తవంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజూ ఎత్తిపోసే రెండు టీఎంసీల నీటిని ఆయకట్టుకు సరఫరా చేసేలా పనులు పూర్తిచేయడానికి మరో రూ.పది వేల కోట్ల వరకు అవసరం. ఈ ప్రాజెక్టులో భాగంగా సింగూరు వద్ద చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలున్నాయి. ఈ రెండింటికీ నాబార్డు ద్వారా రుణం కోసం ప్రయత్నించినా ఇంకా కొలిక్కి రాలేదు. అదనపు టీఎంసీ పనికి మంజూరైన రుణం విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుత కేటాయింపులో నిర్వహణ వ్యయం పోనూ ఈ పనుల కోసం మిగిలింది రూ.2,650 కోట్లు మాత్రమే. అందుకే కేటాయింపుల్లో ఈ మొత్తాన్నే చూపారు.

నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ రుణాలకు రూ.3,200 కోట్లు

సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, కంతనపల్లి, శ్రీరామసాగర్‌ వరద కాలువ ప్రాజెక్టుల కోసం తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా సర్కారు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంది. ఇందులో దేవాదుల, వరద కాలువల తాలూకూ రుణానికి అసలు తిరిగి చెల్లించడం ప్రారంభించడంతోపాటు, మిగిలిన ప్రాజెక్టుల రుణాలకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.3,200 కోట్లు కేటాయించారు.

రుణాలు మంజూరైతేనే పురోగతి

సీతారామ ఎత్తిపోతలకు రూ.950 కోట్లు ఇచ్చారు. వాస్తవంగా ఈ పథకంలో మిగిలిన పనులు పూర్తిచేయడానికి రూ.మూడు వేల కోట్లు, ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీల పనులకు మరో రూ.3,500 కోట్లు అవసరం. బ్యాంకులు రూ.8 వేల కోట్లు మంజూరుచేసి రూ.5,600 కోట్లు ఇచ్చాయి. మరో రూ.2400 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ రుణాలు కొంత కాలంగా విడుదల కావడం లేదు. ప్రస్తుత కేటాయింపులు ఆయకట్టు లక్ష్యానికి తగ్గట్లుగా పనులు పూర్తి చేయడానికి సరిపోవు. అంటే ఇక్కడా రుణాలపైన ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది.

* రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల పనులు 75 శాతం నుంచి 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు,  కొన్నిచోట్ల ప్రధాన పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలన్నది లక్ష్యం. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఎస్‌.ఎల్‌.బి.సి, దేవాదుల, వరదకాలువ, చిన్న కాళేశ్వరం, దిండి తదితర పథకాల కింద ఆయకట్టు లక్ష్యం ఉంది. ప్రస్తుత కేటాయింపులు దీనికి తగ్గట్లుగా లేకపోయినా, కేటాయించిన నిధులు విడుదలచేస్తే కొంతవరకైనా ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

చెరువుల పునరుద్ధరణకు పెద్దపీట

ఇక మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి ఈ బడ్జెట్‌లో రూ.335 కోట్లు కేటాయించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చెరువుల పునరుద్ధరణ, బాగుకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.1,300 కోట్లు కేటాయించింది. నిర్వహణకు రూ.380 కోట్లు ఇచ్చింది.


‘పాలమూరు’ పరుగుపెట్టేనా?

రాష్ట్రంలోని మరో ప్రధాన ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు  ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.23 వేల కోట్లు ఖర్చుచేసింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీలతో సహా మొత్తం పనులు పూర్తి చేయాలంటే మరో రూ.35 వేల కోట్ల వరకు అవసరం అవుతుందని అంచనా. ఇంకా డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టలేదు కాబట్టి నిర్మాణంలో ఉన్న పనుల వరకు పూర్తిచేయడానికే మరో రూ.18 వేల కోట్ల వరకు అవసరం అవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు మాత్రమే కేటాయించినందున, తీసుకోబోయే రుణం మీదనే ఎక్కువగా ఆధార పడక తప్పని పరిస్థితి. రుణం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కాకపోతే పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని