సొంతింటికి దన్ను

సొంతిల్లు లేని పేదలకు కలల లోగిలిని సాకారం చేసేందుకు ఆర్థిక తోడ్పాటును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 07 Feb 2023 03:46 IST

జాగా ఉంటే రూ.3 లక్షల సాయం
బడ్జెట్‌లో రూ.12 వేల కోట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: సొంతిల్లు లేని పేదలకు కలల లోగిలిని సాకారం చేసేందుకు ఆర్థిక తోడ్పాటును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొంత జాగా ఉంటే అందులో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఇందుకుగాను బడ్జెట్‌లో భారీగా రూ.12 వేల కోట్లు కేటాయించింది. అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రతిపాదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల ఇళ్ల యూనిట్లలో నియోజకవర్గానికి మూడు వేల మంది చొప్పున  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 3.57 లక్షల మందికి చేయూత లభిస్తుంది. మిగతా 43 వేల యూనిట్లు ముఖ్యమంత్రి కోటా పరిధిలో ఉంటాయి.

2020 మార్చి 8న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లోనే సొంత స్థలం ఉన్న లక్ష మందికి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అప్పడు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలుగా పేర్కొంది. 2021లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ సాయాన్ని రూ.3 లక్షలుగా కుదించింది. ఏటా నిధులు కేటాయిస్తూ వస్తున్నా... కరోనా ప్రభావం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ పథకం ఇప్పటిదాకా అమలుకాలేదు.  ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారుకాలేదు. రూ.3 లక్షల సాయం కూడా ఒకేసారి కాకుండా నిర్మాణపురోగతిని బట్టి ఐదు విడతల్లో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పేదలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చే పథకం అమలవుతుండగా ఇళ్ల కోసం ఎదురుచూసేవారు లక్షలలో ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక పలుచోట్ల అత్యంత క్లిష్టంగా మారుతోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంతో కలిపి దీనిని అమలుచేస్తోంది. ఇప్పటివరకు 2.91 లక్షల ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 1.36 లక్షల నిర్మాణం పూర్తయింది. 90 శాతం పూర్తయినవి మరో అర లక్షకుపైగానే ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రగతిపద్దులో పీఎంఏవై కింద రూ.8,350 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చూపించింది.


కార్మికశాఖకు రూ.542 కోట్లు

కార్మికశాఖకు ప్రభుత్వం రూ.542.18 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ.410.37 కోట్లు చూపించింది. ఈఎస్‌ఐలో మందుల కొనుగోళ్లకు రూ.83.73 కోట్లు, వైద్యఖర్చుల తిరిగి చెల్లింపుల కింద రూ.10 కోట్లు పేర్కొంది. ప్రగతి పద్దు కింద కేటాయించిన నిధుల్లో ఉపాధి కల్పన సేవలు రూ.1.35 కోట్లు, మల్లేపల్లి ఐటీఐకి రూ.50 లక్షలు, ఐటీఐల అభివృద్ధికి రూ.4 కోట్లు, ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కింద రూ.కోటి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ కింద రూ.2 కోట్లు చూపించింది. పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్పంగానే నిధులు కేటాయించింది.


ఐటీకి రూ.365 కోట్లు

రాష్ట్రంలో రూ.365.54 కోట్లను ఐటీ రంగానికి ప్రభుత్వం కేటాయించింది. ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.150 కోట్లు, వీహబ్‌కు రూ.7.95 కోట్లు, టీ-హబ్‌కు రూ.2 కోట్లు ఇచ్చింది. స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌కు నిధులు రూ.5 కోట్ల నుంచి రూ.8.88 కోట్లకు పెరిగాయి. తెలంగాణ నైపుణ్యాభివృద్ధి కేంద్రం(టాస్క్‌)కు రూ.16 కోట్ల నుంచి రూ.17.89 కోట్లకు నిధుల్ని పెంచింది. సాఫ్ట్‌నెట్‌కు రూ.22.86 కోట్లు, టీ-ఎలక్ట్రానిక్స్‌కు రూ.8 కోట్లు, టీ-వర్క్స్‌కు రూ.5 కోట్లు, టీ-ఫైబర్‌గ్రిడ్‌కు రూ.7 కోట్లు, టీ-ఫండ్‌కు రూ.4 కోట్లు కేటాయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని