సకల జనుల కోసం..

రాష్ట్రంలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది.

Updated : 07 Feb 2023 07:51 IST

దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి రూ.33,416 కోట్లు

రాష్ట్రంలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు 2023-24 బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను పెంచింది. ఉపకార వేతనాలు, స్వయం ఉపాధి పథకాలు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ పథకాలకు ప్రాధాన్యమిచ్చింది. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. సంక్షేమ వర్గాల బడ్జెట్‌లో ఈ ఒక్క పథకానికే చేసిన కేటాయింపులు దాదాపు సగం ఉండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలకు కలిపి రూ.33,416.79 కోట్లను సర్కారు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది దాదాపు రూ.1,950 కోట్లు అధికం.


పెరిగిన కల్యాణలక్ష్మి కేటాయింపులు

కల్యాణలక్ష్మి పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాదికి రూ.3,210 కోట్లకు ప్రభుత్వం పెంచింది. పేదింటి ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద ప్రభుత్వం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటివరకు 12 లక్షల మందికి మంజూరైంది. 2023-24 సంవత్సరానికి ఎస్సీ సంక్షేమశాఖకు రూ.500 కోట్లు, ఎస్టీ సంక్షేమశాఖకు రూ.260 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు రూ.2,000 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖకు రూ.450 కోట్లు కేటాయించింది.

స్వయం ఉపాధికి రూ.1,533 కోట్లు

సంక్షేమవర్గాల స్వయంఉపాధి పథకాలకు బడ్జెట్‌లో రూ.1,533.45 కోట్లు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో దళితబంధు మినహా ఇతర పథకాలకు రూ.140 కోట్లు మాత్రమే ఇచ్చింది. గిరిజన ఆర్థిక సహకార సొసైటీ(ట్రైకార్‌) కింద వివిధ పథకాలకు ప్రస్తుత బడ్జెట్‌ కంటే రూ.60 కోట్లు పెంచి రూ.523.45 కోట్లు కేటాయించింది. ఇందులో స్వయంఉపాధి పథకాలకు రూ.323.45 కోట్లు, భూమి అభివృద్ధి పథకం(గిరివికాసం)కు రూ.150 కోట్లు, సీఎం ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పథకానికి రూ.50 కోట్లు ఇచ్చింది.

* ఎంబీసీ, బీసీ కార్పొరేషన్‌లకు రూ.300 కోట్ల చొప్పున నిధులిచ్చింది. వీటిలో బీసీ ఫెడరేషన్లకు కలిపి రూ.51.30 కోట్లు కేటాయించింది. గీత కార్మికుల సంక్షేమానికి రూ.30 కోట్లు ఇచ్చింది.

* స్వయంఉపాధి రుణాలకు క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.2.57 కోట్ల నుంచి రూ.120 కోట్లకు, మైనార్టీ ఆర్థిక సహకార సంస్థకు రూ.28.31 కోట్ల నుంచి రూ.150 కోట్లకు కేటాయింపులను పెంచింది.

గురుకులాలకు రూ.2,289 కోట్లు

సంక్షేమ గురుకుల సొసైటీలకు కేటాయింపులు పెద్దగా పెరగలేదు. అత్యధికంగా 329 గురుకుల విద్యాలయాలున్న బీసీ సొసైటీకి రూ.397.50 కోట్లు ఇవ్వగా.. ఎస్సీ గురుకులాలకు రూ.1,145.86 కోట్లు, గిరిజన గురుకులాలకు రూ.522.8 కోట్లు, మైనార్టీ గురుకులాలకు రూ.222.92 కోట్లు ఇచ్చారు.

విదేశీవిద్య పథకానికి రూ.273 కోట్లు

విదేశీవిద్య పథకానికి అన్ని సంక్షేమశాఖల్లోనూ నిధుల కేటాయింపులు పెరిగాయి. మైనార్టీ విద్యార్థుల నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.118 కోట్లకు, బీసీల కోసం మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీవిద్య పథకానికి రూ.60 కోట్ల నుంచి రూ.70.80 కోట్లకు పెంచింది. ఎస్సీలకు అంబేడ్కర్‌ విదేశీవిద్య పథకం కింద రూ.20 కోట్లు పెంచి రూ.65 కోట్లు కేటాయించింది. ఎస్టీలకు రూ.20 కోట్లు ఇవ్వనుంది.


బోధన రుసుములు, ఉపకారానికి రూ.2,850 కోట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకార వేతనాలకు నిధులు పెరిగాయి. పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలకు దాదాపు రూ.400 కోట్లు పెరిగాయి. సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి మొత్తం రూ.2,850.37 కోట్లు కేటాయించారు. 

* తాజా బడ్జెట్‌లో బీసీ సంక్షేమశాఖకు ఉపకార వేతనాల బడ్జెట్‌ను రూ.250 కోట్లు పెంచుతూ రూ.1,568.65 కోట్లు కేటాయించింది. ఎస్సీ సంక్షేమశాఖకు రూ.605.26 కోట్లు, ఎస్టీ సంక్షేమశాఖకు రూ.369.66 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖకు రూ.306.8 కోట్లు ఇచ్చింది.


దళితబంధుతో 1.77 లక్షల మందికి లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి బడ్జెట్‌లో భారీగా రూ.17,700 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.77 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1,500 మందికి రూ.10 లక్షల చొప్పున యూనిట్లు మంజూరు చేయనుంది. ప్రస్తుత(2022-23) ఆర్థిక సంవత్సరంలో తొలుత నియోజకవర్గానికి 1,500 మంది లబ్ధిదారులకు మంజూరు లక్ష్యంగా ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నియోజకవర్గానికి 500 మందికి తగ్గిస్తూ బడ్జెట్‌ అంచనాలను రూ.11 వేల కోట్లకు పరిమితం చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసులు అక్కర్లేదని హైకోర్టు ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని, విధివిధానాలను జారీ చేయాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమశాఖ లేఖ రాసింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఈ ఏడాది ఎంపిక నిలిచిపోయింది. ఈ ఏడాది కేటాయించిన రూ.17,700 కోట్లలో రూ.2 వేల కోట్లను విడుదల చేసినప్పటికీ.. రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితి లేకుండా పోయింది.

 ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు