రహదారులిక కళకళ

రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల, ఇతర లింకు రోడ్ల నిర్మాణాలు చేపట్టగా చాలాచోట్ల గుంతలు పడ్డాయి.

Published : 07 Feb 2023 04:28 IST

నిర్వహణకు రూ.2,500 కోట్ల కేటాయింపు  
నూతన నిర్మాణాలకు రూ.2,075 కోట్లు
ప్రాంతీయ వలయ రహదారికి రూ.500 కోట్లు
బడ్జెట్‌లో రహదారులు- భవనాలకు రూ.6,859 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల, ఇతర లింకు రోడ్ల నిర్మాణాలు చేపట్టగా చాలాచోట్ల గుంతలు పడ్డాయి. దీంతో ఈసారి వాటి నిర్వహణపై సర్కారు దృష్టిపెట్టింది. 2023-24 బడ్జెట్‌లో రహదారులు, భవనాల శాఖకు రోడ్ల కోసం రూ.6,859 కోట్లు కేటాయించింది. దీనిలో మరమ్మతులు, నిర్వహణకు రూ.2,500 కోట్లు, కొత్త నిర్మాణాలకు రూ.2,075 కోట్లు చూపించారు. ఇందులోనూ మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు కొన్నిచోట్ల నిర్మించాల్సిన రహదారులకు రూ.200 కోట్లు ఉన్నాయి. రైల్వే అండర్‌, ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయించారు.

వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు రూ.498 కోట్లు

వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలను బాహ్య ప్రపంచంతో అనుసంధానించేందుకు ఈ ఏడాది రూ.498 కోట్లు కేటాయించారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో నక్సలిజం ఉనికి లేకుండా చేసేందుకు అక్కడి ప్రజలు, గిరిజనులకు రవాణా సౌకర్యాలు కల్పించాలనేది ఎల్‌డబ్ల్యూఈడబ్ల్యూ పనుల ప్రధాన ఉద్దేశం.

ప్రాంతీయ రింగురోడ్డుకు అరకొరే

హైదరాబాద్‌ అవతల నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం భూసేకరణకే పోనుంది. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని ఒప్పందం చేసుకున్నాయి. గతేడాది భూసేకరణకు రూ.500కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు. ఇప్పటికే ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా సేకరణ ప్రక్రియ తుది నోటిఫికేషన్‌ వరకు వచ్చింది. ఒక్కసారి ప్రకటన విడుదలైతే జాతీయ రహదారుల సంస్థ నష్టపరిహారం చెల్లించాలి. దీనిలో 158 కిలోమీటర్ల తొలి భాగం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా సుమారు రూ.1,200 కోట్లు, 187 కిలోమీటర్ల రెండో విడత కోసం మరో రూ.1,200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. తొలివిడత నిధులివ్వాలంటూ కేంద్రం రాష్ట్రానికి ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది.

కేటాయింపు భారీ.. విడుదలేదీ!

రెండోసారి అధికారం చేపట్టాక గడచిన, నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో సర్కారు భారీగా నిధులైతే కేటాయించినా.. వ్యయమంతా కాగితాల్లోనే కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగియటానికి రెండు నెలలున్నా.. విడుదల చేసిన నిధులు 50 శాతం కూడా లేవని శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతకు ముందు సంవత్సరాల్లోనూ బడ్జెట్‌ కేటాయింపుల్లో 50 నుంచి 60 శాతానికి మించి నిధులివ్వలేదని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణ ప్రతిపాదన దస్త్రాలను దాటడం లేదు. రెండేళ్ల నుంచి నిధులు కేటాయిస్తున్నా కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగలేదు.


సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లోనూ ఇంతే మొత్తం ఇచ్చింది. పనులు చివరిదశకు చేరుకోగా వచ్చే 17న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని