అడవుల విస్తీర్ణంలో తెలంగాణ ప్రథమం

అడవుల విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2019-21 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ‘ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌-2021’లో ఈ విషయాన్ని ప్రస్తావించారని ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు.

Updated : 07 Feb 2023 05:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: అడవుల విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2019-21 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ‘ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌-2021’లో ఈ విషయాన్ని ప్రస్తావించారని ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. 2015లో తెలంగాణ 19,854 చదరపు కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా.. 2019 నాటికి 20,582 చదరపు కి.మీ.లకు పెరిగింది. 2021 నాటికి 21,214 చదరపు కి.మీ.లకు చేరుకుంది. 2019-21 కాలంలో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కి.మీ.(3.07 శాతం) అడవులు విస్తరించాయి. ఇదేసమయంలో దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతంలో పెరుగుదల 1,540 చదరపు కి.మీ.లు(0.22 శాతం) మాత్రమే నమోదు కావడం గమనార్హం.

అడవుల ఖిల్లా.. భద్రాద్రి జిల్లా

రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. జిల్లాలో 4,311.38 చదరపు కి.మీ.లలో అడవులు విస్తరించాయి. 2,939.15 చదరపు కి.మీ.(10.89 శాతం)తో ములుగు రెండో స్థానంలో.. 2,496.68 చదరపు కి.మీ.(9.26 శాతం)తో నాగర్‌కర్నూల్‌ మూడో స్థానంలో ఉన్నాయి. జిల్లా భూభాగంలో ఎక్కువ శాతం అటవీ ప్రాంతం ఉన్న జిల్లాగా ములుగు(71.22 శాతం) నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం(61.45%), ఆసిఫాబాద్‌(54.45%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం

* 2015 నుంచి ఇప్పటివరకు కొత్త పరిశ్రమల నిర్వహణకు టీఎస్‌ఐపాస్‌ అనుమతుల్లో మేడ్చల్‌ జిల్లా 21.2 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి(8.01%), రంగారెడ్డి(7.54%) ఉన్నాయి.

* రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ పెట్టుబడులు రంగారెడ్డి జిల్లా(32.15 శాతం)లోనే నమోదయ్యాయి. నల్గొండలో 11.17, కొత్తగూడెంలో 9.05 శాతం ఉన్నాయి.

* ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా 56.66 శాతంతో తొలి స్థానంలో ఉంది. వరంగల్‌(11.12%), సంగారెడ్డి(8.04%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రాష్ట్రంలో లక్ష కి.మీ. రహదారులు

రాష్ట్రంలో రోడ్ల పొడవు లక్ష కిలోమీటర్లు దాటింది. మొత్తం 1,09,260 కి.మీ. పొడవు రోడ్లున్నాయి. అందులో 61.80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్ర రహదారులు(హైవేలు), జిల్లా రోడ్లు 25.39 శాతం ఉండగా.. జాతీయ రహదారులు 4.56 శాతమున్నాయి. మొత్తం రోడ్ల పొడవులో జీహెచ్‌ఎంసీలో 8.25 శాతం ఉండటం విశేషం.

సైకాలజీలో పీజీ చేసిన 28 మంది ‘చర్లపల్లి’ ఖైదీలు

చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో 28 మంది ఖైదీలు ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేసి.. పట్టాలు పొందారు. రాష్ట్రంలో సబ్‌, జిల్లా జైళ్లు కలిపి 47 ఉన్నాయి. వాటిలో 7,845 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉండగా.. 2022 డిసెంబరు 11 నాటికి విచారణ, నిర్బంధ, శిక్ష పడిన ఖైదీలు 6,786 మంది ఉన్నారు.


సర్కారు బడులు నల్గొండలో ఎక్కువ

ములుగు జిల్లాలో అతి తక్కువగా 353 ప్రభుత్వ పాఠశాలలుండగా.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,483 బడులున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలు ములుగులో అతి తక్కువగా 47 ఉండగా.. అత్యధికంగా హైదరాబాద్‌లో 2,156 ఉన్నాయి. ఎక్కువ ప్రైవేట్‌ పాఠశాలలున్న మొదటి మూడు జిల్లాలుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి నిలిచాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం 2020-21లో 43.47 ఉండగా.. 2021-22లో 49.77కు పెరగడం గమనార్హం. 2019-20లో 42.91 శాతం మందే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2021-22లో సర్కారు బడుల్లో అత్యధిక శాతం విద్యార్థులు నమోదు కావడం విశేషం.


మరికొన్ని ముఖ్యాంశాలు..

* రాష్ట్రంలోని మొత్తం బ్యాంకు శాఖల్లో 46%(2,732) నగరాలు, పట్టణాల్లోనే ఉన్నాయి. మిగిలిన వాటిలో సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో 24%(1,408) ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 30%(1,818) ఉన్నాయి.

* మాంసం ఉత్పత్తి గత తొమ్మిదేళ్లలో దాదాపు అయిదు రెట్లు పెరిగింది. 2013-13లో 2.30 లక్షల టన్నులు ఉండగా.. 2021-22 నాటికి 10.14 లక్షల టన్నులకు పెరిగింది. పాల ఉత్పత్తిలో 55, గుడ్ల ఉత్పత్తిలో 71 శాతం వృద్ధి నమోదైంది.

* పోలీస్‌ బలగాల సంఖ్య 2015లో 52,116 ఉండగా.. 2019 నాటికి 77,680కి చేరింది. అంటే దాదాపు 50 శాతం పెరిగింది.

* రాష్ట్రంలోని మొత్తం కార్మికుల్లో 33.21 శాతం మంది సేవారంగంలో పనిచేస్తున్నారు.  ఈ అంశంలో జాతీయ సగటు 29.64 శాతమే. రాష్ట్రంలో సేవారంగంలో ఉన్నవారిలో 39.75 శాతం మంది వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. మరో 21.04 శాతం మంది రవాణా, స్టోరేజీ, కమ్యూనికేషన్‌ రంగాల్లో ఉన్నారు. అర్బన్‌ కార్మికుల్లో 63.22 శాతం మంది సేవా రంగంలో పనిచేస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 18.28 శాతం మంది ఈ రంగంలో ఉన్నారు.

*  తెలంగాణ ప్రభుత్వం 2022 మార్చి 31 నాటికి 13.79 లక్షల ఉత్తర్వులను జారీ చేసింది. గవర్నమెంట్‌ ఆర్డర్‌ ఇష్యూ రిజిస్టర్‌ (జీవోఐర్‌) పోర్టల్‌ ద్వారా సచివాలయంలోని శాఖలు 1,63,896, వాణిజ్య పన్నులశాఖ 4,26,590, ట్రాన్స్‌కో 34,774, సచివాలయ శాఖలు ఎఫ్‌ఎంఎస్‌లో జారీ చేసినవి 6,89,819, ఎస్‌వోఎంఎస్‌ ద్వారా 64,813 ఉత్తర్వులు జారీ చేశాయి.

* 2014 జూన్‌ నుంచి 2023 జూన్‌ వరకు నమోదైన ఈ-లావాదేవీల్లో (ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌) దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రతి వెయ్యి జనాభాకు రాష్ట్రంలో 1,58,241 లావాదేవీలు జరిగాయి. రెండో స్థానంలో ఉన్న ఏపీలో 1,41,147, మూడో స్థానంలో ఉన్న కేరళలో 1,40,709 నమోదయ్యాయి. బిహార్‌లో 11,267, మహారాష్ట్రలో 15,819 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని