అటకెక్కిన ‘లక్ష మోటారు సైకిళ్లు’

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రకటించిన లక్ష మోటారు సైకిళ్ల పథకం కార్యరూపం దాల్చలేదు. కార్మికులకు మోటారు సైకిళ్లు ఇవ్వాలన్న 2022-23 ఏడాది బడ్జెట్‌లోని ఆలోచన ప్రతిపాదనలకే పరిమితమైంది.

Published : 07 Feb 2023 04:28 IST

ప్రతిపాదనలకే పరిమితమైన పథకం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రకటించిన లక్ష మోటారు సైకిళ్ల పథకం కార్యరూపం దాల్చలేదు. కార్మికులకు మోటారు సైకిళ్లు ఇవ్వాలన్న 2022-23 ఏడాది బడ్జెట్‌లోని ఆలోచన ప్రతిపాదనలకే పరిమితమైంది. 2023-24 బడ్జెట్‌లో ఈ పథకం ఊసెత్తలేదు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో లక్ష మందికి తొలివిడత కింద రాయితీపై మోటారు సైకిళ్లను అందజేయాలని 2022-23 ఏడాదికి బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే పథకం విధివిధానాలు వెల్లడిస్తామని తెలిపినా ఇప్పటి వరకు విడుదల కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 60 ఏళ్ల లోపు 22.53 లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీరిలో 13.94 లక్షల మంది కార్మికులు తమ సభ్యత్వాన్ని ఏటా పునరుద్ధరించుకుంటున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నిర్మాణాలపై ప్రభుత్వం ఒకశాతం పన్ను వసూలు చేస్తోంది. ఈ లెక్కన తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పరిధిలో రూ.1600 కోట్లు నిధులున్నాయి. మరోవైపు విభజన చట్టం కింద ఏపీ నుంచి రూ.400 కోట్లు రావాల్సి ఉంది. వీటి నుంచి కార్మికుల సంక్షేమానికి, ప్రమాదవశాత్తు మరణించిన వారికి బీమా సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోంది. ద్విచక్రవాహనాలు అందిస్తే ఒకచోట నుంచి మరోచోటకు వేగంగా వెళ్లడంతో పాటు ఉపాధికి సహాయంగా ఉంటుందని భావించి అందుబాటులోని నిధులతో నిర్మాణ రంగ కార్మికులకు రాయితీ కింద వాటిని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తొలివిడత కింద కనీసం 30-50 శాతం సబ్సిడీతో రూ.500 కోట్ల వ్యయంతో కార్మికశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరగా తొమ్మిది నెలలుగా అడుగు ముందడుగు పడలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు