డబుల్‌ డెకర్‌ ఈవీ బస్సులు వచ్చాయ్‌

భాగ్యనగర చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా.. నగర రహదారులపై డబుల్‌ డెకర్‌ విద్యుత్‌ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.

Updated : 08 Feb 2023 05:15 IST

ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌, సీఎస్‌
తొలుత మూడు అందుబాటులోకి..
విడతల వారీగా 20కి పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగర చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా.. నగర రహదారులపై డబుల్‌ డెకర్‌ విద్యుత్‌ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. నిజాం కాలం నుంచి 2003 వరకు నగరంలో డబుల్‌ డెకర్‌ బస్సులు తిరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అవి కనుమరుగయ్యాయి. అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్‌కు నగరం సిద్ధమవుతున్న తరుణంలో మళ్లీ అలనాటి చరిత్రను గుర్తుకు తెచ్చేలా రాజధానిలో డబుల్‌ డెకర్‌ బస్సులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆరు బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో మూడు బస్సులను అవుటర్‌ రింగ్‌ రోడ్డు గ్రోత్‌ కారిడార్‌ కార్యాలయం వద్ద మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో మరో మూడు బస్సులు రానున్నాయి. విడతల వారీగా బస్సుల సంఖ్యను 20కి పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన మూడు బస్సుల్లో ఒకటి ఓపెన్‌టాప్‌. ఒక్కో బస్సుకు రూ.2.16 కోట్లు వెచ్చించారు. వీటి నిర్వహణను గుత్తేదారు సంస్థ ఏడేళ్లపాటు చూడనుంది. ఒక్కో బస్సులో 65 సీట్ల వరకు ఉంటాయి. బస్సు పొడవు 9.8 మీటర్లు కాగా.. ఎత్తు 4.7 మీటర్లు. రెండున్నర గంటలపాటు ఛార్జింగ్‌ చేస్తే.. ఈ బస్సుల్లో 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ పాల్గొన్నారు.

నగర పర్యాటకానికి వినియోగించేలా..

డబుల్‌ డెకర్‌ ఈవీ బస్సులను పర్యాటక సంస్థకు కేటాయించి... నగర పర్యాటకం(సిటీ టూర్‌) కోసం వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఫార్ములా ఈ-రేసింగ్‌ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన సందర్శకులు, పర్యాటకులను ఆకట్టుకునేలా ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు, ప్యారడైజ్‌, నిజాం కళాశాల చుట్టూ తిప్పనున్నారు. ఆ రోజు ఉచితంగానే నడపనున్నారు. ఆ తర్వాత హెరిటేజ్‌ సర్క్యూట్‌(రూటు)కు రూపకల్పన చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని