ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగింతపై సుప్రీంలో సవాల్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.

Published : 08 Feb 2023 05:06 IST

పిటిషన్‌ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించిన సీనియర్‌ న్యాయవాది దవే

ఈనాడు, దిల్లీ: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవైచంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ జేబీ పర్డీవాలా ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ఈ కేసును మెన్షన్‌ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను ఈ కేసును ఇక్కడ మెన్షన్‌ను చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కొందరు వ్యక్తులు చేస్తున్న కుట్రలపై కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన కేసులను పరిశీలించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని సవాల్‌ చేస్తూ మేము వేసిన అప్పీల్‌ను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం తీర్పును కొంతకాలం నిలిపేయాలని, అంతవరకూ సీబీఐ ప్రవేశించకుండా చూడాలన్న విజ్ఞప్తినీ తోసిపుచ్చింది. అందువల్ల ఈ కేసుపై తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరముంది. ఒకవేళ ఈ కేసులో సీబీఐ ప్రవేశిస్తే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంతా దెబ్బతింటుంది’’ అని దుష్యంత్‌దవే ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందిస్తూ ఈ కేసును బుధవారం మెన్షన్‌ చేయాలని సూచించారు. ‘‘మేం తప్పకుండా ఈ అంశాన్ని లిస్ట్‌ చేస్తాం. మీరు రేపు మెన్షన్‌ చేయండి. మీరే రావాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలు మీ జూనియర్‌కు అప్పగించండి. ఒకవేళ మీరు మెన్షన్‌ చేయకపోయినా.. అది వచ్చే వారం విచారణకు వస్తుంది’’ అని పేర్కొన్నారు.


తీర్పును వారం రోజులైనా నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌

డిసెంబరు 26న ఇచ్చిన తీర్పు అమలును కనీసం వారం రోజులైనా నిలిపివేయాలంటూ హైకోర్టును ప్రభుత్వం అభ్యర్థించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని డివిజన్‌ బెంచ్‌ సోమవారం తీర్పు చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి వద్ద రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ మంగళవారం అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు అమలును మూడు వారాలపాటు నిలిపివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మధ్యాహ్నం విచారణ చేపట్టారు. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ- అప్పీళ్లను డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసిన వెంటనే తమకు ఫైళ్లు అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లేఖ రాశారన్నారు. దీన్నిబట్టి సీబీఐ అత్యుత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. భాజపా, నిందితుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు జె.ప్రభాకర్‌, ఎల్‌.రవిచందర్‌, మయూర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. విచారణార్హం లేదని అప్పీళ్లను కొట్టివేసిన తరువాత తిరిగి సింగిల్‌ జడ్జి వద్దకు రావడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. డివిజన్‌ బెంచ్‌ మౌఖిక సూచనల మేరకు ఇప్పటివరకు ఫైళ్లను సీబీఐ స్వాధీనం చేసుకోలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. విలీన సిద్ధాంతం ప్రకారం సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీలు దాఖలు చేసినపుడు అది ఒకే కేసు అవుతుందని, అలాంటప్పుడు తిరిగి సింగిల్‌ జడ్జి వద్ద ఎలా దరఖాస్తు చేయవచ్చని ప్రశ్నించారు. సాంకేతికపరమైన ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి(సీజే)ని అడిగి చెప్పాలని ఏజీకి సూచిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని