జిల్లాల్లోని సమస్యలపై సీసీఎల్‌ఏ నజర్‌

జిల్లా స్థాయిలో నెలకొని ఉన్న కీలక భూ సమస్యలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయం దృష్టి సారించింది.

Published : 08 Feb 2023 03:43 IST

భూ సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలకు షెడ్యూల్‌
మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల అమలుపైనా దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా స్థాయిలో నెలకొని ఉన్న కీలక భూ సమస్యలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయం దృష్టి సారించింది. జిల్లాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై రెండు రోజుల క్రితం రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో సీసీఎల్‌ఏ, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. ధరణి సమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులు, ఇప్పటి వరకు రెవెన్యూశాఖ జారీచేసిన పలు ఉత్తర్వులను ప్రధాన కమిషనర్‌ అధ్యయనం చేస్తున్నారు. జిల్లా స్థాయిలో భూ పరిపాలనను గాడిలో పెట్టడానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇంటర్‌, కళాశాలల కమిషనర్‌గా ఉన్న ఆయనకు ఇటీవల ప్రభుత్వం రెవెన్యూశాఖ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల శాఖపై సమీక్షించిన ఆయన పలు అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ధరణి పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. పోర్టల్‌ను సమగ్రంగా ప్రక్షాళన చేసి సులువుగా రైతులకు సేవలు అందేలా తీర్చిదిద్దడానికి కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.

జిల్లాల్లోనే పరిష్కారాలు

రాష్ట్రంలో 72 లక్షల భూ ఖాతాలు ఉండగా 61.31 లక్షల వ్యవసాయ ఖాతాలు ధరణిలో ఉన్నాయి. హైదరాబాద్‌ జిల్లా మినహా గ్రామీణంలోనే ఇవి ఉన్నాయి. గుంట విస్తీర్ణానికి సంబంధించిన భూ సమస్య పరిష్కారానికి కూడా కొందరు రైతులు హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయానికి వస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రాల్లోనే సమస్యలకు పరిష్కారం లభించేలా అవసరమైన ఏర్పాట్లపై ప్రధాన కమిషనర్‌ దృష్టి సారించినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని