దసరాకు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి

రాష్ట్రంలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను దసరా నాటికి పూర్తి చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

Published : 08 Feb 2023 03:43 IST

మంత్రి హరీశ్‌రావు

రాయదుర్గం, నార్సింగి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను దసరా నాటికి పూర్తి చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో నాలుగు బీసీ కులాల(గాండ్ల, రంగ్రేజ్‌, భట్రాజ్‌, ఆరెకటిక) ఆత్మగౌరవ భవనాలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఇదే ప్రాంతంలో నిర్మాణాలు పూర్తైన యాదవ, కుర్మ భవనాలను మంత్రులు గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహిచిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. మార్చి 10న యాదవ కురమ భవనాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఆ భవనాలకు ప్రహరీ, ఆర్చ్‌ల నిర్మాణానికి రూ.2.6 కోట్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. భవనాల ప్రారంభోత్సవం అనంతరం లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తలసాని మాట్లాడుతూ.. దేశంలో 80 కోట్ల బీసీలు ఉండగా కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.2 వేల కోట్లే కేటాయించారని విమర్శించారు. రాష్ట్రంలో రెండు కోట్ల బీసీ జనాభాకు రూ.6,229 కోట్లు కేటాయించడాన్ని బట్టి వారిపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమాభిమానాలను అర్థం చేసుకోవచ్చన్నారు. గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 25 కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశామని, మంగళవారం నాలుగింటి పనుల ప్రారంభంతో ఆ సంఖ్య 29కి చేరిందని తెలిపారు. త్వరలోనే మిగతా వాటికీ శంకుస్థాపన చేసి మార్చి నాటికి పనులను ప్రారంభిస్తామన్నారు. పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీలకు ముఖ్యమంత్రి 365 గురుకులాలు ఏర్పాటు చేశారని, స్టడీ సెంటర్లు, తదితరాలు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్‌ రావు శ్రీధర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, నార్సింగి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రేఖ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని