‘317’ జీఓ ఉపాధ్యాయులకూ అవకాశం

రాష్ట్రంలో 317 జీఓ ద్వారా గత ఏడాది వేరే జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయులు సైతం బదిలీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా అవకాశమిచ్చింది.

Published : 08 Feb 2023 03:43 IST

12 నుంచి బదిలీ దరఖాస్తులకు వెసులుబాటు
విద్యాశాఖ మంత్రి సబిత వెల్లడి
మారిన కాలపట్టిక.. మార్చి 14తో ప్రక్రియ పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 317 జీఓ ద్వారా గత ఏడాది వేరే జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయులు సైతం బదిలీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా అవకాశమిచ్చింది. వారు ఈనెల 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించవచ్చు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని మంత్రి తెలిపారు. ఇప్పటికే వచ్చిన 59వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని చెప్పారు. గత ఏడాది సుమారు 25వేల మంది ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. వారిలో కనీసం 15వేల మంది బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

కొత్త కాలపట్టిక

రెండేళ్ల స్టేషన్‌ సర్వీస్‌ లేకున్నా 317 జీఓ కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారు తాజాగా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం మంగళవారం జీఓ జారీ చేసింది. ఈ క్రమంలో పాత జిల్లాలో పనిచేసిన సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకొని సీనియారిటీకి పాయింట్లు కేటాయిస్తారు. గతంలో విడుదల చేసిన పాత కాలపట్టిక ప్రకారం మార్చి 4వ తేదీతో బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా.. సవరించిన కాలపట్టికతో అది మార్చి 14 వరకు సాగనుంది.

*  ఫిబ్రవరి 12-14 వరకు: ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

*  21, 22 తేదీల్లో: సీనియారిటీ తుది జాబితా ప్రకటన

*  24: ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు

*  26, 27, 28 తేదీల్లో: స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతి

*  మార్చి 4-5 తేదీల్లో: స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ

*  మార్చి 7, 8, 9 తేదీల్లో: ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి

*  మార్చి 14వ తేదీ: ఎస్‌జీటీలకు బదిలీలు

*  మార్చి 16-30 మధ్య: డీఈఓలు, ఆర్‌జేడీల ఉత్తర్వులపై అభ్యంతరాల సమర్పణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు