సంస్కృత వర్సిటీ వీసీ, పూర్వ రిజిస్ట్రార్‌కు జైలుశిక్ష, జరిమానా

కోర్టు ధిక్కరణ కేసులో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రస్తుత వీసీ జీఎస్సార్‌ కృష్ణమూర్తి, పూర్వ రిజిస్ట్రార్‌ సీహెచ్‌సీ సత్యనారాయణకు హైకోర్టు రెండు రోజుల సాధరణ జైలుశిక్ష, రూ.2వేల చొప్పున జరిమానా విధించింది.

Published : 08 Feb 2023 04:12 IST

తీర్పు అమలును నిలుపుదల చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రస్తుత వీసీ జీఎస్సార్‌ కృష్ణమూర్తి, పూర్వ రిజిస్ట్రార్‌ సీహెచ్‌సీ సత్యనారాయణకు హైకోర్టు రెండు రోజుల సాధరణ జైలుశిక్ష, రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. తీర్పు అమలును 30 రోజులు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. 2017-18 విద్యా సంవత్సరానికి తనను గెస్ట్‌/పార్ట్‌టైం టీచర్‌గా తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రిజిస్ట్రార్‌ కొనసాగించకపోవడాన్ని సవాలుచేస్తూ వెంకట శ్రీనివాసరావు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం అవసరం ఏర్పడితే పిటిషనర్‌ను కొనసాగనివ్వాలని 2017 సెప్టెంబరు 21న ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో వెంకట శ్రీనివాసరావు అప్పట్లో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (ప్రస్తుతం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం) రిజిస్ట్రార్లుగా పనిచేసిన సీహెచ్‌సీ సత్యనారాయణ (ప్రస్తుతం పదవీవిరమణ చేశారు), జీఎస్సార్‌ కృష్ణమూర్తి(ప్రస్తుత వీసీ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై తాజాగా విచారణ జరిపిన న్యాయమూర్తి.. ప్రతివాదులు  ఇరువురూ సివిల్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తేల్చారు. రెండురోజుల జైలు శిక్ష, రూ.2వేల చొప్పున జరిమానా విధించారు. తీర్పు అమలును 30 రోజులు నిలుపుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని