ఎమ్మెల్యేలకు ఎరపై సీబీఐ..!

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు అనూహ్య మలుపులు తిరుగుతుండగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా విచారణ దిశగా పావులు కదుపుతోంది. తాజాగా మరోసారి లేఖ రాసింది.

Published : 09 Feb 2023 05:56 IST

దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థ
కేసు వివరాల కోసం ఆరోసారి లేఖాస్త్రం
హైదరాబాద్‌ కార్యాలయం వేదికగా శిబిరం

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు అనూహ్య మలుపులు తిరుగుతుండగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా విచారణ దిశగా పావులు కదుపుతోంది. తాజాగా మరోసారి లేఖ రాసింది. హైదరాబాద్‌ కేంద్రంగానే దర్యాప్తు కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. భారాస ఎమ్మెల్యేలను భాజపాలోకి లాగేందుకు మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌లో కుట్ర చేశారనే ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణ ఈనెల 17న జరగనుంది. ఈ క్రమంలోనే కేసు వివరాలను సమర్పించాలని రెండు రోజుల క్రితం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ డైరెక్టర్‌... దిల్లీ విభాగానికి అప్పగించారు. అందుకే దిల్లీ సీబీఐ విభాగం ఎస్పీ సుమన్‌కుమార్‌ పేరిట ఈ లేఖ ఉంది. అయితే దర్యాప్తు బృందం మాత్రం హైదరాబాద్‌లోనే మకాం వేసింది. హైదరాబాద్‌ కోఠి కేంద్రీయ సదన్‌లోని సీబీఐ కార్యాలయంలోనే శిబిరం ఏర్పాటు చేయడం గమనార్హం.

తొలిసారి డిసెంబరు 31న లేఖ

అప్పట్లో ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ను రద్దు చేస్తూ ఈ బాధ్యతను సీబీఐకు ఇస్తూ హైకోర్టు సింగిల్‌జడ్జి బెంచ్‌ తీర్పు వెలువరించిన నేపథ్యంలో గత డిసెంబరు31న సీబీఐ తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్‌ వివరాలు సమర్పించాలని కోరింది. అయితే సింగిల్‌జడ్జి బెంచ్‌ తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సీబీఐ అప్పటికి మిన్నకుండిపోయింది. తర్వాత పలు సందర్భాల్లోనూ లేఖాస్త్రాల పరంపర కొనసాగించింది. జనవరి 5, 9, 11, 16 తేదీల్లోనూ లేఖలు రాసింది. అయితే కేసు అప్పీళ్ల కారణంగా రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. సుప్రీంకోర్టులో ఈనెల 17న విచారణ జరగనున్న నేపథ్యంలో ఈలోపు సీబీఐ అడిగిన మేరకు రాష్ట్రప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ వివరాల్ని సమర్పిస్తుందా..? లేదా వేచిచూస్తుందా..? అనేది సందేహంగా మారింది.


సింగిల్‌ జడ్జికి పరిధిలేదు.. తేల్చి చెప్పిన హైకోర్టు
తీర్పు అమలుపై స్టేకు నిరాకరణ
అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలంటూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకుగాను సింగిల్‌ జడ్జిని అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను బుధవారం హైకోర్టు తిరస్కరించింది. ఒకసారి సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీలు దాఖలు చేసిన తరువాత.. ఏ కారణం మీద అయినా సరే ఒకసారి కొట్టివేసిన తరువాత అదే పిటిషన్‌పై విచారించే పరిధి సింగిల్‌ జడ్జికి ఉండదని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం ఉదయం అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ కేసు గురించి ప్రస్తావించారు. సింగిల్‌జడ్జి వద్ద స్టే నిమిత్తం దరఖాస్తు దాఖలు చేశామని.. దానిపై విచారించడానికి అనుమతించాలని కోరారు. ఈ ధర్మాసనం కేసు పూర్వాపరాల్లోకి వెళ్లలేదని.. కేవలం విచారణార్హతపైనే నిర్ణయించి అప్పీళ్లను కొట్టివేసిందన్నారు. ఆ వెంటనే కనీసం ఊపిరిపీల్చుకునే సమయం కూడా ఇవ్వకుండా సీబీఐ ఫైళ్లను అప్పగించాలని పదేపదే అడుగుతోందన్నారు. సింగిల్‌ జడ్జి తీర్పుతోపాటు ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపైనా సుప్రీంకోర్టులోనూ అప్పీళ్లు దాఖలు చేశామన్నారు. అందువల్ల సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును కనీసం ఒక్క వారమైనా నిలిపివేయాలని కోరుతున్నామని, ఇందుకోసం సింగిల్‌ జడ్జి వద్ద దరఖాస్తు చేశామన్నారు. అనుమతిస్తే సింగిల్‌ జడ్జి దానిపై విచారణ చేపడతారనగా ధర్మాసనం స్పందిస్తూ ఒకసారి సింగిల్‌ జడ్జి తీర్పుపై దాఖలు చేసిన అప్పీళ్లలో ఈ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేశాక సింగిల్‌ జడ్జి అందులో జోక్యం చేసుకోజాలరంది. మా తీర్పుపై అభ్యంతరాలంటే సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. స్టే దరఖాస్తుపై విచారణ చేపట్టడానికి సింగిల్‌ జడ్జిని అనుమతించాలన్న ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.


ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ

ఈనాడు, దిల్లీ: సంచలనంగా మారిన భారాస ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని బుధవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా  ప్రస్తావించారు. 17వ తేదీన చేపడతామని సీజేఐ బదులివ్వగా.. 13వ తేదీనే చేపట్టాలని లూథ్రా విజ్ఞప్తి చేశారు. ‘‘కేసును సీబీఐకి అప్పగిస్తూ గత డిసెంబరులో హైకోర్టులో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తే ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం తీర్పును కొంతకాలం నిలిపివేయాలని, సీబీఐ రంగంలోకి దిగకుండా చూడాలని మేం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సీబీఐ కేసు దర్యాప్తును చేపడితే పిటిషన్‌ నీరుగారిపోతుంది. అందుకే వెంటనే అత్యవసరంగా విచారణ చేపట్టాలి’’ అని లూథ్రా కోరారు. సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులపై మీరు ఇక్కడకు (సుప్రీంకోర్టు) రాకుండా డివిజన్‌ బెంచ్‌కు ఎందుకు వెళ్లారని సీజేఐ ప్రశ్నించారు. నిందితుల రిమాండ్‌, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కేసును సత్వరమే విచారించాలని, సీబీఐ చేతికి ఫైళ్లు వెళితే కేసులో ఏం మిగిలి ఉండదని ధర్మాసనానికి నివేదించారు. సీబీఐ నుంచి ఫైళ్లను  వెనక్కి తెప్పించవచ్చని సీజేఐ వ్యాఖ్యానించారు. కేసు విచారణను 17న చేపడతామని స్పష్టం చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని