రోజువారీ విద్యుత్‌ గరిష్ఠ డిమాండ్‌.. వచ్చే పదేళ్లలో 77 శాతం వృద్ధి!

దేశంలో విద్యుత్‌ డిమాండ్‌, వినియోగం పెరుగుతున్నందున ఇంధన పొదుపుపై అందరూ దృష్టి పెట్టాలని జాతీయ విద్యుత్‌ ప్రణాళిక’ (ఎన్‌పీఎల్‌) ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది.

Updated : 09 Feb 2023 04:31 IST

జాతీయ విద్యుత్‌ ప్రణాళిక ముసాయిదా విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో విద్యుత్‌ డిమాండ్‌, వినియోగం పెరుగుతున్నందున ఇంధన పొదుపుపై అందరూ దృష్టి పెట్టాలని జాతీయ విద్యుత్‌ ప్రణాళిక’ (ఎన్‌పీఎల్‌) ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది. 2022-32 మధ్యకాలంలో దేశ విద్యుత్‌ అవసరాల మేరకు చేపట్టాల్సిన చర్యలను వివరించింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 22లోగా పంపాలని ప్రజలకు, విద్యుత్‌ సంస్థలకు బుధవారం లేఖ రాసింది. ప్రస్తుతం దేశంలో ఒకరోజు గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 2.05 లక్షల మెగావాట్లుండగా అది 2026-27 నాటికి 2.72 లక్షలు, 2031-32 నాటికి 3.63 లక్షల మెగావాట్లకు (ప్రస్తుత డిమాండ్‌ కంటే 77 శాతం అధికం) చేరుతుందని అంచనా.

* ప్రస్తుతం దేశంలో అన్ని రకాలు కలిపి 4 లక్షల మెగావాట్లకు పైగా స్థాపిత ఉత్పత్తి సామర్థ్యమున్న విద్యుత్కేంద్రాలున్నాయి. 1.65 లక్షల మె.వా. సామర్థ్యమున్న విద్యుత్కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా 2022-27 మధ్యకాలంలో 2,28,541 మె.వా, 2027-32 మధ్యకాలంలో మరో 2.43 లక్షల మె.వా, విద్యుత్కేంద్రాల నిర్మాణం పూర్తిచేయాలి. ఇందుకోసం రూ.14,30,718 కోట్లు పెట్టుబడులు పెట్టాలి. ఇందులో 75 శాతం రుణాలుగా తీసుకోవాలి.

* ఎన్నో ఏళ్లుగా విద్యుదుత్పత్తి చేస్తున్న 4,629 మె.వా. సామర్థ్యం గల 11 థర్మల్‌ కేంద్రాలు 2027 మార్చి నాటికి మూతపడనున్నాయి. అదే సమయానికి మరో 25,950 మె.వా. సామర్థ్యంతో నిర్మిస్తున్న 19 ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.

* తెలంగాణలోని దామరచర్ల వద్ద నిర్మిస్తున్న 4,000 మె.వా, యాదాద్రి, రామగుండంలో 1,600 మె.వా. ప్లాంటు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

* మూతపడేవాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్‌టీటీపీఎస్‌)లోని మొత్తం ఆరు ప్లాంట్ల కాలం తీరనుంది. వీటి సామర్థ్యం 1260 మె.వా. ఇదే ప్లాంటులో 5వ దశ కింద నిర్మిస్తున్న 800 మె.వా. ఉత్పత్తి 2026-27లోపు ప్రారంభం కానుంది.

* 2031-32 నాటికి దేశంలో 17,770 మె.వా. ఉత్పత్తి సామర్థ్యమున్న పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్కేంద్రాలను నిర్మించాలి. వీటిలో 9,150 మె.వా. కేంద్రాలు ఏపీలోనే నిర్మిస్తారని అంచనా.

* ఏపీలోని పోలవరం ప్రాజెక్టు వద్ద 960 మె.వా. జలవిద్యుత్కేంద్రం కూడా పూర్తికానుంది.

* ఏపీలో 38,440, తెలంగాణలో 20,410 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయి.

* దేశంలో విద్యుదుత్పత్తి వల్ల 2020-21లో 910 మిలియన్‌ టన్నుల (మి.ట) కర్బన ఉద్గారాలు వెలువడగా 2032 నాటికి 1180 మి.ట.లు వస్తాయని అంచనా.

* గత ఆర్థిక సంవత్సరం (2021-22) నాటికి మొత్తం దేశ విద్యుదుత్పత్తి 1492 బిలియన్‌ యూనిట్లలో సంప్రదాయేతర ఇంధనం వాటా 21.54 శాతముంది.

* దేశంలో మొత్తం 748 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయి.

* 2031-32 నాటికి దేశంలో సంప్రదాయేతర ఇంధన (ఆర్‌ఈ) కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 5.69 లక్షల మెగావాట్లకు చేరుతుందని అంచనా. అప్పటికి దేశంలోని మొత్తం విద్యుత్‌ డిమాండులో 45.09 శాతం దీని నుంచే రానుంది.

* 2022 మార్చి ఆఖరు నాటికి... తెలంగాణలో ఆర్‌ఈ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 7439.12, ఏపీలో10,885.16 మెగావాట్లు ఉంది.

* ఆర్‌ఈ, థర్మల్‌ విద్యుత్‌ సరఫరాలో గ్రిడ్‌ నిర్వహణ సమర్థత కోసం బ్యాటరీ ఇంధన నిల్వ సదుపాయాలను పెంచాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని