సంక్షోభంలో ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలు

ఇనుము తయారీలో వాడే ముడిసరకు ఫెర్రో సిలికాన్‌ను ఉత్పత్తి చేసే ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి.

Published : 09 Feb 2023 03:53 IST

విద్యుత్తు టారిఫ్‌ పెంపుతో మూతపడుతున్న కంపెనీలు

ఈనాడు, నల్గొండ: ఇనుము తయారీలో వాడే ముడిసరకు ఫెర్రో సిలికాన్‌ను ఉత్పత్తి చేసే ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పది పరిశ్రమలు ఉండగా..ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మూడు ఉన్నాయి. విద్యుత్తు టారిఫ్‌ పెంపు, రాయితీల్లో కోత కారణంగా ప్రస్తుతం ఏడు పరిశ్రమలు మూతపడగా..సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని మూడింటిలో మాత్రమే నామమాత్రంగా ఉత్పత్తి జరుగుతోంది. ఈ పరిశ్రమలు గతంలో ప్రత్యక్షంగా 5 వేల మంది కార్మికులకు ఉపాధినివ్వగా..మరో 10 వేల మంది కార్మికులకు పరోక్షంగా ఉపాధి దొరికేది. పరిశ్రమల మూతతో సుమారు 12 వేలకు పైగా కార్మికులు రోడ్డున పడ్డట్లయింది. పదేళ్లలో ఈ రంగానికి ఇచ్చే విద్యుత్తు టారిఫ్‌ ధరను మూడు రెట్లకు పైగా పెంచడంతో కరెంటు ఛార్జీలకు తాళలేక యాజమాన్యాలు పరిశ్రమలను మూసేస్తున్నాయి. 2012లో ఈ పరిశ్రమలకు విద్యుత్తు యూనిట్‌కు రూ.2.30 ఉండగా...దానిని 2016లో రూ.5.35కి పెంచారు. ఏడాది కిందట దీనిని రూ.8కి పెంచడంతో ముడిసరకుకు గిరాకీ ఉన్నా ఉత్పత్తి వ్యయం పెరగడంతో భారీగా నష్టాలు వస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, కేతేపల్లిలో ఉన్న పరిశ్రమలను మూసి వేయగా...ప్రస్తుతం కట్టంగూరు మండలంలోని అయిటిపాముల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో మాత్రమే నామమాత్రంగా ముడిసరకును ఉత్పత్తి చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో తక్కువే

ఈ రంగానికి విద్యుత్తు టారిఫ్‌లు ఇతర రాష్ట్రాల్లో తక్కువగానే ఉన్నాయి. ఏపీలో ఒక యూనిట్‌కు రూ.6 ఉండగా, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో యూనిట్‌కు రూ.4 కంటే తక్కువగానే ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.  


రాయితీలు కల్పిస్తేనే మనుగడ

విద్యుత్తు ఛార్జీల పెంపుతో ఉత్పత్తి వ్యయం మూడు రెట్లు పెరిగింది. గిరాకీ ఉన్నా.. ఎక్కువ భాగం విద్యుత్‌ ఛార్జీలకే చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఏం మిగలడం లేదు. పదేళ్లలో మూడురెట్లు పెంచడంతో కంపెనీలు మూసేస్తున్నాం. ప్రతిభ ఉన్నా కంపెనీలు మూత పడటంతో చాలా మంది ఉపాధి కోల్పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. విద్యుత్తు ఛార్జీలు తగ్గించి రాయితీలు కల్పిస్తేనే ఈ రంగానికి మనుగడ ఉంటుంది.

వేమవరపు నర్సింహులు, డైరెక్టర్‌ సాయిదుర్గా ఇండస్ట్రీస్‌, నకిరేకల్‌, నల్గొండ జిల్లాTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు