మేమూ ఈ-చలానాల బాధితులమే.. భారాస ఎమ్మెల్సీల ఆసక్తికర చర్చ

శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం భారాస సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డి ట్రాఫిక్‌ ఈ-చలానాల అంశాన్ని ప్రస్తావించారు.

Updated : 09 Feb 2023 11:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం భారాస సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డి ట్రాఫిక్‌ ఈ-చలానాల అంశాన్ని ప్రస్తావించారు. హైవేల్లో 60 కి.మీ.ల వేగంతో వెళితేనే అధిక వేగం కింద ఈ-చలానా నమోదవుతోందని పేర్కొన్నారు. తన వాహనంపై ఇలాంటి చలానాలు అనేకం నమోదయ్యాయని వాటి ప్రతుల్ని ప్రదర్శించారు. వేగపరిమితిని 85-90 కి.మీ.లకైనా పెంచాలని కోరారు. ఈక్రమంలో అధికారపక్షానికి చెందిన పలువురు ఇతర సభ్యులు.. తామూ ఈ-చలానాల బాధితులమేనని సుభాష్‌రెడ్డి వాదనకు శ్రుతి కలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ.. అధికవేగం, మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌లోడింగ్‌ కారణాలతో రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నందునే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నియమాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్థను యూరోపియన్‌ దేశాల తరహాలో ఐటీఎంఎస్‌ ప్రాజెక్టు కిందకు మార్చుతున్నట్లు తెలిపారు. దీనివల్ల హైదరాబాద్‌ రోడ్లపై వాహనాల సగటు వేగం గంటకు 22 కి.మీ.ల నుంచి 27 కి.మీ.లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలోని సీసీ కెమెరాల్లో 40 శాతం వరకు పనిచేయడంలేదనే ప్రశ్నపై స్పందిస్తూ.. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల నేరస్థులే ఎక్కువగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారని.. వారిని నియంత్రించేందుకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని