అసెంబ్లీలో ‘కంటి వెలుగు’

ప్రజాప్రతినిధులందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Published : 09 Feb 2023 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాప్రతినిధులందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్‌ ప్రారంభించారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ.. కంటి వెలుగు పథకాన్ని ఇతర రాష్ట్రాల వాళ్లు ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలిపారు. మండలి ఛైర్మన్‌ గుత్తా మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. ఎంఐఎం శాసనసభ్యులు అక్బరుద్దీన్‌, పాషాఖాద్రి, ముంతాజ్‌ఖాన్‌లను వైద్య మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి తోడ్కొని వచ్చి కళ్ల పరీక్షలు చేయించారు. 

మంత్రి హరీశ్‌రావుకు ఐఎంఏ కృతజ్ఞతలు

నీట్‌ పీజీ పరీక్ష కోసం ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) హర్షం వ్యక్తం చేసింది. తాము చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రానికి లేఖ రాసి తెలంగాణలోని 6,800 హౌస్‌ సర్జన్లకు పరీక్షలు రాసే అవకాశం కల్పించేందుకు కృషి చేశారంటూ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రావు, ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం శాసనసభలో వారు మంత్రిని కలిశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని