మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మృతికి శాసనసభ, మండలి సంతాపం

ఇటీవల మరణించిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ బుధవారం సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు వెలిచాల జగపతిరావు (కరీంనగర్‌), మందాడి సత్యనారాయణరెడ్డి (హనుమకొండ), గడ్డం రుద్రమదేవి (కోదాడ) ఇటీవల కాలంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Updated : 09 Feb 2023 05:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల మరణించిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ బుధవారం సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు వెలిచాల జగపతిరావు (కరీంనగర్‌), మందాడి సత్యనారాయణరెడ్డి (హనుమకొండ), గడ్డం రుద్రమదేవి (కోదాడ) ఇటీవల కాలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లో వారి సేవలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.

శాసనమండలికి సైతం ప్రాతినిధ్యం వహించిన వెలిచాల జగపతిరావుకు మండలిలోనూ నివాళి అర్పించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ జస్టిస్‌ ఎ.సీతారాంరెడ్డి ఇటీవలే మృతి చెందిన నేపథ్యంలో సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాజకీయాల్లో వీరిద్దరి ప్రస్థానాన్ని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చదివి వినిపించారు. అనంతరం సభ్యులు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణకు బిల్లు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్టం-1963కు సవరణల బిల్లును మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇక నుంచి దీనిని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్టం-2023గా వ్యవహరిస్తారు. ఈ వర్సిటీ పరిధిలోని హోం సైన్స్‌ను కమ్యూనిటీ సైన్స్‌గా వ్యవహరించేందుకు, వ్యవసాయ కళాశాలలు, వసతిగృహాల నిర్వహణ, కళాశాలలకు అనుమతి లేదా రద్దుకు వీలుగా ఇందులో సవరణలను ప్రతిపాదించారు.

* సింగరేణి కాలరీస్‌ సంస్థ వార్షిక నివేదికను మంత్రి జగదీశ్‌రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గృహనిర్మాణ మండలి తొలి మూడు వార్షిక నివేదిక (2015-18)లను హోంమంత్రి మహమూద్‌అలీ మండలిలో ప్రవేశపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని