Hyderabad Metro: మెట్రో రెండో దశ... 62 కి.మీ.

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా టికెట్‌ ధరలు పెంచకూడదని హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థను కోరామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Updated : 13 Feb 2023 11:22 IST

 ఇప్పటికే కేంద్రానికి డీపీఆర్‌లు ఇచ్చాం
బడ్జెట్‌లో రూపాయీ కేటాయించకుండా వివక్ష
శాసనమండలిలో పురపాలక మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా టికెట్‌ ధరలు పెంచకూడదని హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థను కోరామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆర్టీసీ గరిష్ఠ ధరలకు మించి టికెట్‌ ధర ఉండకూడదన్న నిబంధనకు లోబడాలని, ధరలు పెరిగితే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. కేంద్ర మెట్రో చట్టం ప్రకారం హైదరాబాద్‌ మెట్రోరైలు టికెట్‌ ధరల పెంపు అధికారాన్ని ప్రాజెక్టు సంస్థకే కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పారు. మెట్రోరైలు రెండోదశలో 62 కి.మీ. మార్గాన్ని నిర్మించనున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఆదివారం శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మెట్రోరైలుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘ఇప్పటికే మైండ్‌స్పేస్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ. మార్గానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఎల్‌బీనగర్‌ నుంచి నాగోలు (5కి.మీ), బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ (26కి.మీ) మార్గానికి డీపీఆర్‌లు రూపొందించి కేంద్రానికి అందజేశాం. బెంగళూరు, చెన్నై, యూపీలో అయిదు నగరాలు, గుజరాత్‌లో గాంధీనగర్‌ మెట్రోకు వేలాది కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణపై పగబట్టినట్లు హైదరాబాద్‌కు మాత్రం బడ్జెట్‌లో నిధులు ఇవ్వలేదు. మొదటిదశ రైలు ప్రాజెక్టు కింద వ్యయం రూ.1,455 కోట్లలో ఇప్పటికీ రూ.255 కోట్లు విడుదల చేయలేదు. కేంద్రం వివేకంతో ఆలోచించి హైదరాబాద్‌ మెట్రోకు నిధులు ఇవ్వాలి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రోరైలు అంటే.. ఇది ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కోసమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. కరోనా తరువాత చాలామంది నగరానికి దూరంగా శంషాబాద్‌, షాద్‌నగర్‌ వైపు వెళ్లి నివసిస్తున్నారు. ఈప్రాజెక్టు సాధారణ ప్రజలందరికీ ఉపయోగకరమైంది. రూ.6,250 కోట్లతో రాష్ట్రప్రభుత్వం సొంత నిధులతో మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మిస్తుంది.

అక్కడ కార్యాచరణపై త్వరలోనే ప్రణాళిక..

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం హిమాయత్‌సాగర్‌, గండిపేట చుట్టూ గ్రామాల ప్రజలకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జీవో నం.111 రద్దుచేసి జీవో నం.69 తీసుకువచ్చింది. 1920లో నిర్మించిన ఆ జలాశయాలు కాలుష్యంబారిన పడకుండా ప్రణాళికను రూపొందిస్తాం. ఆ ప్రాంతంలో అభివృద్ధిపై ఏర్పాటైన కమిటీ మంత్రి, సీఎస్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తాం. రాష్ట్రంలో భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ తెదేపా, కాంగ్రెస్‌ హయాంలో రెండుసార్లు జరిగింది. మూడోసారి క్రమబద్ధీకరణకు 2015లో జీవో జారీచేయగా కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు ఈనెల 16న విచారణకు రానుంది. ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకుని తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు కట్టుకున్నవారికి జీవో నం.58 కింద ఉచితంగా క్రమబద్ధీకరించాం. హైదరాబాద్‌లోనే లక్ష మందికి పట్టాలిచ్చాం. పట్టణాల్లో భవనాల అనుమతుల్లో అవినీతి, అక్రమాలను నియంత్రించేందుకు టీఎస్‌బీపాస్‌ అమల్లోకి తీసుకువచ్చాం.’’ అని మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులపై భారాన్ని తగ్గించేందుకు డిప్యూటీ వార్డెన్‌లను నియమించే అవకాశం లేదని ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కొప్పుల సమాధానమిచ్చారు. దివ్యాంగులకు ఆర్‌టీసీ బస్‌ పాస్‌ల్లో రాయితీ పెంచే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు 76.19 లక్షల మంది బీసీలకు ఉపకారవేతనాల కింద రూ.2,724 కోట్లు, బోధన ఫీజుల కింద రూ.52.8 లక్షల మందికి రూ.6,300 కోట్లు ఖర్చు చేశామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 2014 నాటికి 19 బీసీ గురుకులాలు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్యను సీఎం కేసీఆర్‌ 310కి పెంచారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని