దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు

దేశంలో ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ బాగుందంటే.. అది కొండగట్టులోనే అనేలా ఇక్కడి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 16 Feb 2023 07:34 IST

ఎన్ని నిధులైనా వెచ్చిద్దాం
బృహత్తర ప్రణాళికతో కొత్తరూపు
అంజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్షలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, కరీంనగర్‌; న్యూస్‌టుడే- మల్యాల: దేశంలో ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ బాగుందంటే.. అది కొండగట్టులోనే అనేలా ఇక్కడి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘హనుమాన్‌ జయంతి ఇక్కడి క్షేత్రంలో గొప్పగా జరిగేలా.. దేశంలో సగం మంది భక్తులు ఈ దివ్యధామానికి వచ్చేలా ప్రాంగణాల్ని పూర్తిగా మార్చాలి. ఇప్పుడున్న ప్రధాన ఆలయం సహా పరిసరాల రూపురేఖల్ని మార్చేలా బృహత్తర ప్రణాళికను అమలు చేసి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి’ అని అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి, హోదాలో తొలిసారిగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకోవడానికి ముందే హెలికాప్టర్‌ నుంచి పరిసరాలను గమనించారు. సిబ్బంది పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సుమారు అరగంటపాటు ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉన్న ఉప ఆలయాలను దర్శించుకున్నారు. అర్చకులు శాలువా కప్పి, స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశీర్వచనాల్ని అందించారు. తరువాత ఆలయ సమీపంలో సుమారు రెండు గంటలపాటు క్షేత్ర అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి ఇటీవల రూపొందించిన ప్రణాళికను, వివిధ మ్యాప్‌లను సీఎం పరిశీలించారు. వాస్తు నియమాలను అనుసరించి భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. గుట్ట పైభాగంలో ఎకరం స్థలంలో ఉన్న గుడిని ఆధునికీకరించే ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు చెప్పగా.. ఆ స్థలం సరిపోదని.. మూడెకరాల విస్తీర్ణం విధిగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

మూలమలుపులను తొలగించాలి

‘‘ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రస్తుతం 1.8 కి.మీ.లు ఉన్న ఘాట్‌ రోడ్డును 3 కి.మీ.ల దూరం పెంచి మూలమలుపులను తొలగించాలి. జేఎన్టీయూ మీదుగా వచ్చే రహదారి వెడల్పుని ఇప్పుడున్న 7 మీటర్ల నుంచి 14 మీటర్లకు విస్తరించండి. ఈ రెండింటినీ పాత పుష్కరిణి వరకు పొడిగించాలి. సువిశాలమైన ప్రధాన ద్వారాన్ని నిర్మించాలి. అంజనాద్రి పేరుతో వేద పాఠశాలను ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాన్ని ప్రణాళికలో పొందుపర్చాలి.

విద్యుత్తు ఉపకేంద్రం, దవాఖానా, ప్రయాణ ప్రాంగణం, అగ్నిమాపక కేంద్రం, కాటేజీలు, పోలీస్‌స్టేషన్‌, దీక్షా విరమణ మండపం పక్కనే కల్యాణకట్ట ఏర్పాటు చేయండి. గుట్టపై  తాగునీటి వసతిని మెరుగుపర్చేలా సమీపంలోని సంతోల్ల లొద్ది నుంచి కొండపైకి నిరంతర నీటి సరఫరా చేపట్టాలి. అవసరమైతే వరద కాలువ ద్వారా కాళేశ్వర జలాలను గుట్టపైకి తెండి.  మానసిక రోగులు ఉండేందుకు వీలుగా కేర్‌ టేకర్‌లతో కూడిన భవనాన్ని నిర్మించాలి. అటవీశాఖ అధికారులూ.. ఇక్కడి అభయారణ్యంపై తగిన దృష్టి పెట్టండి. అవసరమైనన్ని ఔషధ మొక్కలను నాటించాలి. మైసూర్‌ - ఊటీ మార్గంలోని నీలగిరి కొండల్లోని బందీపుర్‌ అభయారణ్యం మాదిరిగా మార్చండి.

త్వరలో మళ్లీ వస్తా...

వారం, పది రోజుల్లో మళ్లీ కొండగట్టుకు వస్తా. రాత్రి వేళ ఇక్కడే ఉండి అభివృద్ధిపై సమీక్షిస్తా. మూడేళ్లలో ఇక్కడి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చొరవ చూపిస్తా. అర్చకుల కోసం ఇళ్లను కట్టిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సమీక్ష నిర్వహించే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కుర్చీలను వేసి వేదికను ఏర్పాటు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక పైకి వెళ్లకుండా ముందు భాగంలో కుర్చీలో ఆసీనులై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.
సమీక్ష నిర్వహణ సమయంలో ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. మైక్‌ ద్వారా ఉన్నతాధికారులు పిలవడంతో పోలీసులు ఆయన్ని లోపలికి పంపించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, భానుప్రసాద్‌, ఎమ్మెల్యేలు రవిశంకర్‌, సంజయ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


వెయ్యి కోట్లయినా...

యాదాద్రి ఆలయానికి మించిన స్థలం ఇక్కడి గుట్ట ఆవరణలో ఉంది. సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకర్షించే గొప్ప ధార్మిక క్షేత్రంగా కొండగట్టును మార్చాలి. ఇందుకోసం ఇప్పటికే ప్రకటించిన రూ.100 కోట్లు కాకుండా అవసరమైతే మరో రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లను కేటాయించుకుందాం.


ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఆలయమిది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఇక్కడి గుట్టకు లక్షల భక్తులు వచ్చేలా రూపురేఖల్ని మార్చాలి. దీక్షాపరులు ఒకేసారి 50వేల మంది వచ్చినా.. బస చేయడానికి.. మాల విరమణ చేయడానికి వసతి ఉండాలి. ఆలయానికి దగ్గరగా 86 ఎకరాల్లో సువిశాలమైన పార్కింగ్‌ను ఏర్పాటు చేయండి. ఇక్కడి పచ్చదనం, పర్యావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదు. చెట్ల మధ్యనే భక్తుల కోసం అతిథి గృహాల నిర్మాణం చేపట్టాలి.


వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి గర్భాలయం మినహా మిగతా ఆలయాన్ని పునర్నిర్మాణంతో విస్తరించాలి. యాదాద్రి ఆలయ నిర్మాణ సమయంలో సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాలు చేపట్టాం. అదే మాదిరిగా ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడదాం.  తిరుమల పుణ్యక్షేత్రాన్ని గుర్తుచేసేలా ఇక్కడి ప్రాంగణాల్ని తీర్చిదిద్దాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని