Hyderabad: 240 కేజీల బరువున్న యువకుడికి ఉస్మానియాలో సర్జరీ!

అతి బరువుతో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్‌ సర్జరీతో ఊరట కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా చికిత్స చేయడం రాష్ట్రంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు.

Updated : 22 Feb 2023 10:43 IST

లాప్రోస్కోపిక్‌ విధానంలో పొట్ట పరిమాణం తగ్గింపు
2 నెలల్లో 70 కేజీల బరువు తగ్గిన వైనం

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, ఉస్మానియా ఆసుపత్రి: అతి బరువుతో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్‌ సర్జరీతో ఊరట కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా చికిత్స చేయడం రాష్ట్రంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. రెండు నెలల క్రితం సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆ యువకుడి బరువు 170 కేజీలకు చేరింది. దాదాపు 70 కేజీల వరకు తగ్గుదల కన్పించిందని, మరో 80-90 కేజీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన మునీందర్‌(24) చిన్నతనం నుంచే ఊబకాయంతో బాధపడుతున్నారు. వయసుతో పాటు అతని బరువు కూడా పెరుగుతూ వచ్చింది. నడవడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిలో సంప్రదించగా.. సర్జరీ కోసం రూ.10-రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో.. చివరికి ఉస్మానియా వైద్యులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, అనస్తీషియా విభాగాలకు చెందిన దాదాపు 15 మంది వైద్యులు బృందంగా ఏర్పడి యువకుడికి  బేరియాట్రిక్‌ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతోపాటు, ఎక్కువ ఆహారం తీసుకోకుండా నియంత్రించేందుకు ఆహారం స్వీకరించే చిన్నపేగును కూడా కొంత మేరకు తగ్గించారు. రెండు నెలల క్రితం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. తర్వాత వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ వచ్చారు. ఆహార పరిమాణం గణనీయంగా తగ్గడంతో సదరు యువకుడి శరీర బరువు కూడా తగ్గుతూ వచ్చింది. సాధారణంగా బేరియాట్రిక్‌ సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడం చాలా అరుదు. అధిక బరువుతో మునీందర్‌ మోకాళ్లపై భారం పడటం, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతున్నందున ఉస్మానియా వైద్యులు మానవీయ కోణంలో స్పందించి యువకుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సర్జరీ సమయంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు వైద్యులు తెలిపారు. మునీందర్‌ దాదాపు 240 కేజీల బరువు ఉండటంతో ఆపరేషన్‌ టేబుల్‌పై పడుకోబెట్టడం కూడా కష్టంగా మారిందని, శరీరానికి రెండువైపులా అదనపు బల్లలు ఏర్పాటు చేసి అతి కష్టం మీద సర్జరీ పూర్తి చేశామన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యులను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని